శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By PNR
Last Updated : శుక్రవారం, 21 నవంబరు 2014 (15:25 IST)

పాస్ పోర్టు చోరీ.. స్వదేశానికి తిరిగొచ్చిన వెంకయ్య నాయుడు!

స్పెయిన్ బార్సిలోనాలో పాస్ పోర్టు చోరీకి గురైన తర్వాత తాత్కాలిక పాస్ పోర్టుతో కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు గురువారం ఉదయం న్యూఢిల్లీకి చేరుకున్నారు. ‘స్మార్ట్‌ సిటీ ఎక్స్‌పో వరల్డ్‌ కాంగ్రెస్‌'ను ప్రారంభించేందుకు వెళ్లిన ఆయనకు అక్కడ చోరీలు సైతం ఎంత స్మార్ట్‌గా జరుగుతాయో అనుభవంలోకి వచ్చింది. వెంకయ్య పాస్‌పోర్టు ఉన్న బ్యాగ్ చోరీకి గురైన విషయం తెల్సిందే. 
 
చోరికి గురైన ఆయన బ్యాగులో వెంకయ్యపాస్‌పోర్టుతో పాటు, ఆయన ఓఎస్డీ సత్య పాస్‌పోర్టు, ఐడీ, పాన్‌, క్రెడిట్‌ కార్డులు, పెద్ద మొత్తంలో నగదు కూడా ఉన్నాయి. సత్య ఐఫోన్‌ 6, ఎంఎస్‌ సర్ఫేస్‌ ప్రో3 కూడా ఉన్నాయి. బ్యాగు పోయిన విషయం తెలిసినప్పటికీ అక్కడి రాయబారి విక్రం మిశ్రా స్పందించలేదు.
 
ఢిల్లీ నుంచి ఒత్తిడి రావడంతో ఆగమేఘాలపై దొంగ కోసం అన్వేషణ ప్రారంభించారు. ఆ తర్వాత కొద్దిసేపటికి వెంకయ్యనాయుడి పాస్‌పోర్టు చోరీ జరిగిన హోటల్‌కు కొద్దిదూరంలో రోడ్డుపై పడి ఉండటం కనిపించింది. అది దౌత్య హోదా ఉన్న పాస్‌పోర్టు కావడంతో ఆ దొంగ భయపడి ఉంటాడని, ఎందుకైనా మంచిదనే ఉద్దేశంతో వదిలేసి ఉంటాడని భావిస్తున్నారు.
 
ఎట్టకేలకు గురువారం ఉదయం వెంకయ్యనాయుడు, ఆయన ప్రతినిధి వర్గం ఢిల్లీకి చేరుకున్నారు. ఈ చోరీ విషయమై వెంకయ్యనాయుడు ట్విటర్‌ ఖాతాలో రెండు ట్వీట్లు రావడంతో ప్రపంచానికి దీని గురించి తెలిసింది. 
 
‘ఇది ఒక విచిత్ర దేశంలా కనపడుతోంది. ఎవరో నా బ్యాగును దొంగిలించారు' ట్వీట్ చేశారు. అయితే, ఈ విషయమై మంత్రి స్వయంగా ట్వీట్‌ చేయడం ప్రొటోకాల్‌కు విరుద్ధమని అధికారులు అభిప్రాయపడుతున్నారు.
 
వెంకయ్య ట్విటర్‌ ఖాతాను నిర్వహించే ఒక అధికారి ఈ ట్వీట్లను చేసినట్టు సమాచారం. దీనిపై అభ్యంతరాలు వస్తుండడంతో గురువారం సాయంత్రానికి తొలగించారు.