శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By chitra
Last Updated : గురువారం, 4 ఫిబ్రవరి 2016 (16:00 IST)

మానస ఏజెన్సీస్‌‌లో సూర్యపేట విజిలెన్స్ ఆకస్మిక తనిఖీలు.. ఏం దొరికిందంటే?

సూర్యపేటలో విజిలెన్స్ అధికారులు చేసిన ఆకస్మిక తనిఖీలలో మానస ఏజెన్సీస్‌లో అక్రమంగా నిల్వ ఉన్న రూ.13 లక్షల విలువైన ఆహార పదార్థాలను సీజ్ చేశారు. మానస ఏజెన్సీస్‌లో ఆహార పదార్థాలు ఎలాంటి అనుమతి లేకుండా అక్రమంగా నిల్వ ఉంచినట్లు సమాచారం అందడంతో విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేపట్టారు.
 
ఈ తనిఖీల సందర్భంగా అమర్‌కాంత్ రెడ్డి మాట్లాడుతూ.. అనుమతి లేని కంపెనీలకు చెందిన 23రకాల నూనె డబ్బాలు, నూనె ప్యాకెట్లు, నూనె కల్తీ జరుగుతున్నట్లు వచ్చిన అనుమానంతో రూ.8లక్షల విలువ చేసే నూనెను సీజ్ చేశామని తెలిపారు. 
 
అనుమతులు లేకుండా అక్రమంగా నిల్వచేసియున్న రూ.1.80 లక్షల విలువ చేసే 91 క్వింటాళ్ల గోధుమ పిండి, రూ. 20 వేల విలువ చేసే సోంపు ప్యాకెట్లు, రూ. 30వేల ధర విలువ చేసే సబ్బులతో పాటు పెద్ద ఎత్తున సర్ఫ్‌ను సీజ్ చేసినట్లు విజిలెన్స్ డీఎస్పీ అమర్‌కాంత్‌రెడ్డి పేర్కొన్నారు. 
 
సూర్యాపేట సివిల్‌సైప్లె డిప్యూటీ తహసీల్దారు రవీందర్‌రెడ్డి అక్కడికి చేరుకొని సీజ్ చేసిన సరుకులను స్థానిక సాయినాథ్ ఆయిల్ ఏజెన్సీకి అప్పగించారు. ఈ మేరకు మానస ఏజెన్సీకి చెందిన చల్లా పాండయ్యపై కేసు నమోదు చేసి పూర్తి నివేదికను జిల్లా కలెక్టర్‌కు పంపిస్తున్నట్లు డీటీసీఎస్ తెలిపారు.