శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ESHWAR
Last Updated : సోమవారం, 28 జులై 2014 (13:33 IST)

బీజేపీ గూటికి నటి విజయశాంతి?

అక్క రాములమ్మ తన రాజకీయ ప్రస్థానాన్ని బీజేపీ నుంచి ఆరంభించింది. ముఖ్యంగా బీజేపీ అగ్రనేత అద్వానీతో విజయశాంతికి మంచి సంబంధాలు ఉండేవి. అయితే తెలంగాణా కోసం తల్లి తెలంగాణా పార్టీని ఏర్పాటు చేసింది. ఆ తర్వాత ఆ పార్టీని టీఆర్‌ఎస్‌లో విలీనం చేసి తుది వరకూ తెలంగాణా కోసం పోరాడతానని ప్రకటించింది. విజయశాంతి నాకు సోదరితో సమానం అంటూ కేసీఆర్.. కేసీఆర్ నాకు అన్నయ్య అంటూ ఇద్దరూ తెగ పొగిడేసుకున్నారు. అన్న కేసీఆర్‌కు రాఖీ కూడా కట్టింది చెల్లెమ్మ విజయశాంతి. దీంతో తెరాస లోక్‌సభ అభ్యర్థిగా మెదక్ స్థానం నుంచి ఎంపీగా గెలిచి పార్లమెంట్‌లో రాములమ్మ అడుగుపెట్టారు. 
 
అయితే ఆ పార్టీలో ఆమెకు ప్రాధాన్యం రోజురోజుకు తగ్గడం పార్టీ కార్యక్రమాలకు విజయశాంతి దూరంగా ఉండటంతో మా పార్టీలో చేరాలంటూ బీజేపీ మంచి ఆఫర్ కూడా ఇచ్చింది. ఇదే తరుణంలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇస్తున్నట్లు ప్రకటించడంతో సోనియాగాంధీ సమక్షంలో విజయశాంతి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. అయితే, గత అసెంబ్లీ ఎన్నికల్లో మెదక్ అసెంబ్లీ నియోజక వర్గం నుంచి ఎం.ఎల్.ఏగా పోటీచేసి మంత్రి పదవో.. అదృష్టం కలిసొస్తే ముఖ్యమంత్రి పదవో దక్కవచ్చు అని ఊహించింది అయితే ఫలితం మరోలా ఉండటం. మొదక్ అసెంబ్లీ బరిలో పద్మాదేవేందర్ రెడ్డి చేతిలో ఓడిపోవడంతో అమోయంలో పడింది. 
 
కేసీఆర్ ముఖ్యమంత్రి కావడంతో ఖాళీ అయిన మెదక్ పార్లమెంట్ స్థానం నుంచి ఎన్నికల బరిలో దిగాలని కూడా రాములమ్మ వ్యూహా రచన చేసింది. కాంగ్రెస్ పార్టీ తరుపున పోటీచేస్తే ఓటమి తప్పదని భావించిన రాములమ్మ కమలం పార్టీ వైపు చూస్తున్నట్టు సమాచారం. బీజేపీ పార్టీలో తనకున్న పాత పరిచయాలను ఉపయోగించి పార్టీలో చేరాలనుకుంటున్నారు. దీనికి బీజేపీ తెలంగాణా రాష్ట్ర శాఖ కూడా రాములమ్మని రా.. రామ్మని పిలుస్తుందని ప్రచారం. మెదక్ పార్లమెంట్ సీటు ఇచ్చినా.. ఇవ్వక పోయినా ఆమెను కమలం కూటికి చేరాలని అభిమానులు ఒత్తిడి చేస్తున్నారట. నేను కాంగ్రెస్ పార్టీని వీడే ప్రసక్తి లేదంటూ తాజా ఈ ప్రచారాన్ని విజయశాంతి ఖండించినా ఆమె ముందు ఇంతకు మించిన ఆప్షన్ లేదని అంటున్నారు పొలిటికల్ విశ్లేషకులు.