మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By PNR
Last Updated : సోమవారం, 27 ఏప్రియల్ 2015 (11:10 IST)

విజయవాడ మెట్రో రైల్.. నాలుగేళ్లలో పూర్తి!

విజయవాడ మెట్రో ప్రాజెక్టు సంబంధించిన డిటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టు (డీపీఆర్‌)ను ఢిల్లీ మెట్రో రైల్‌ కార్పొరేషన్‌ (డీఎంఆర్‌సీ) ప్రభుత్వానికి అందజేసింది. కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు సమక్షంలో, మెట్రోరైల్‌ ప్రాజెక్టు సలహాదారు శ్రీధరన్‌ కమిటీ సభ్యులు విజయవాడ మెట్రో రైల్‌ ప్రాజెక్టు సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌)ను సీఎం చంద్రబాబుకు అందజేశారు. 
 
విశాఖ డీపీఆర్‌ను జూన్‌ 15 నాటికి అందజేయనున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ సంస్థనే నిర్మాణ బాధ్యతలు చేపట్టాలని సూచించారు. మెట్రో తొలిదశ ప్రాజెక్టును నాలుగేళ్లలో పూర్తి చేయడానికి రూ. 6,823 కోట్లు వ్యయం అవుతుందంటూ డీఎంఆర్‌సీ డీపీఆర్‌ను రూపొందించింది.
 
ప్రాజెక్టు పూర్తయ్యే నాటికి అయ్యే ఖర్చు పెరిగే అవకాశం ఉందని సూచిస్తూ మొత్తంగా రూ.6,823 కోట్లు అంచ నా వ్యయాన్ని డీపీఆర్‌లో పొందుపరిచారు. ఈ లెక్కన కిలోమీటర్‌కు రూ.209 కోట్లు ఖర్చు అవుతుంది. డీఎంఆర్‌సీ ప్రాజెక్టు వ్యయంలో ఆరు శాతం ఛార్జీగా వసూలు చేయనుంది.
 
మొదటి ఫేజ్‌ మొత్తం కారిడార్‌ పొడవు 26.03 కిలోమీటర్లుగా డీఎంఆర్‌సీ తేల్చింది. తొలి దశ ప్రతిపాదిత కారిడార్లలో మొదటిది పండిట్‌ నెహ్రూ బస్‌స్టేషన్‌ టెర్మినల్‌ నుంచి పెనమలూరు వరకు మహాత్మాగాంధీ రోడ్డుపై 12.76 కిలోమీటర్ల మేర కారిడార్‌ ఉంటుంది. పండిట్‌ నెహ్రూ బస్‌స్టేషన్‌ నుంచి నిడమానూరు వరకు కార్ల్‌ మార్క్స్‌ రోడ్డుపై కారిడార్‌ నిడివి 13.27 కిలోమీటర్ల మేర ఉంటుంది. రెండు కారిడార్లకు పీఎన్‌బీఎస్‌ కామన్‌ స్టేషన్‌గా ఉంటుంది. 
 
కాగా, విజయవాడలో మొదటి సారిగా థర్డ్‌ రైల్‌ ట్రాక్షన్‌ విధానంలో లైన్స్‌ వేయాలని డీపీఆర్‌లో డీఎంఆర్‌సీ పేర్కొంది. ఈట్రాక్షన్‌లో ఫ్లై ఓవర్‌పై పట్టాల మధ్య మూడో పట్టా ఉంటుంది. దీనిలో విద్యుత్‌ సరఫరా ఉంటుంది. ఈ విధానం వల్ల పైన విద్యుత్‌ తీగల అవసరం ఉండదు. 
 
ప్రాజెక్టు ప్రారంభించిన అనంతరం టికెట్ల ద్వారా వచ్చే ఆదాయాన్ని, నిర్వహణ వ్యయం, పెట్టిన ఖర్చు లేక్కేసుకుంటే.. మెట్రో రైల్‌ లాభాల్లోకి రావడానికి ఏడేళ్ల సమయం పడుతుందని డీపీఆర్‌లో లెక్కించారు. మెట్రో రైల్‌ ప్రధాన స్టేషన్‌ కోసం పీఎన్‌బీఎస్‌ దగ్గర ఐదంతస్తుల భవనాన్ని నిర్మిస్తారు. మెట్రో కోచ్‌ డిపోను నిడమానూరులో ఏర్పాటు చేస్తారు.