శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By PNR
Last Updated : ఆదివారం, 26 ఏప్రియల్ 2015 (15:06 IST)

విజయవాడ మెట్రో రైలు.. ఢిల్లీకి అప్పగింత.. రూ.6,823 కోట్లతో...

విజయవాడ మెట్రో రైల్ నిర్మాణ పనులను ఢిల్లీ మెట్రోరైల్‌కు అప్పగించనున్నారు. ఈ ప్రాజెక్టును రూ.6,823 కోట్ల వ్యయంతో 25 కిలోమీటర్ల పరిధిలో చేపట్టనున్నారు. నెహ్రూ బస్టాండ్‌ నుంచి పెనమలూరు వరకు 12.76 కి.మీ.లో కారిడార్‌ 1ను రూ.2,557 కోట్ల ఖర్చుతో పూర్తి చేస్తారు. 
 
అలాగే, నెహ్రూ బస్టాండ్‌ నుంచి నిడమనూరు వరకు 13.27 కి.మీ.లో కారిడార్‌ 2ను రూ.3,148 కోట్ల ఖర్చుతో పూర్తి చేస్తారు. ఒక్క కిలోమీటర్‌కు రూ.288 కోట్లు ఖర్చు అవుతుంది. రైల్‌ చార్జీలు 5 కిలోమీటర్లకు 10 రూపాయలు, 10 కి.మీ.లకు 20 రూపాయలు, 10 కి.మీలపైన రూ.30గా ప్రభుత్వం నిర్ణయించింది.
 
ఇదిలావుండగా, ఏపీలో విజయవాడతో పాటు విశాఖపట్టణంలోనూ కొత్తగా ఏర్పాటు కానున్న మెట్రో రైలు ప్రాజెక్టుకు సంబంధించి మరింత స్పష్టత వచ్చింది. ఆదివారం ఉదయం ఢిల్లీ మెట్రో రైలు రూపకర్త శ్రీధరన్, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రెండు నగరాల్లో ఏర్పాటు కానున్న మెట్రో రైలు ప్రాజెక్టులపై ఆయన చంద్రబాబుకు వివరించారు. 
 
శ్రీధరన్ ప్రజెంటేషన్ విన్న తర్వాత, బెజవాడ మెట్రో పనులను ఢిల్లీ మెట్రో రైలుకే అప్పగించాలని చంద్రబాబు నిర్ణయించారు. దీనిపై తదుపరి కేబినెట్ భేటీలో ఆమోదం తెలపనున్నారు. విజయవాడలో రెండు దశలుగా మెట్రో పనులను చేపట్టాలని నిర్ణయించగా, విశాఖలో సమగ్ర నివేదిక రూపొందించాలని తీర్మానించారు.