శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By JSK
Last Modified: మంగళవారం, 28 జూన్ 2016 (20:51 IST)

స‌న్ రైజ్ సిటీగా విశాఖ‌... కోల్‌క‌తా పోర్టుకు మించి...

విశాఖ‌: భారత ప్రభుత్వం లుక్ ఈస్ట్ పాలసీలో భాగంగా విశాఖకు అమితమైన ప్రాధాన్యం ఏర్పడింది. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం కూడా విశాఖను సన్ రైజ్ సిటీగా ప్రమోట్ చేస్తోంది. ఈ నేపధ్యంలో విశాఖ నగరం నుంచి తూర్పు ఆసియా దేశాలు రవాణా కోసం ఆశ్రయిస్తున్నాయి. పశ్చిమ ఆసియా దేశాలు సైతం విశాఖ వైపు చూస్తున్నాయి. ఇదే కోవలో తీర ప్రాంతం లేని నేపాల్‌కు విశాఖ అవసరం ఏర్పడింది. ఇప్పటివరకూ నేపాల్ తమకు కావలసిన వస్తువులను వివిధ దేశాల నుంచి సముద్ర మార్గం ద్వారా కోల్‌కతాకు రప్పించుకుని అక్కడి నుంచి నేపాల్‌కు రోడ్డు రైలు మార్గాల ద్వారా తెప్పించుకుంటున్నారు. ఐతే గతంతో పోల్చుకుంటే కోల్‌కతా పోర్టు రద్దీగా మారడంతో కొంత ఇబ్బందికరమైన పరిస్ధితులు ఏర్పడ్డాయి. 
 
ఇదే సమయంలో విశాఖ పోర్టు చైర్మన్‌గా ఉన్న కృష్ణబాబు కోల్‌కతా పోర్టుకు కూడా ఇంచార్జ్‌గా వ్యవహరిస్తున్నారు. దీంతో ప్రత్యామ్నాయంగా విశాఖ పోర్టును పరిశీలించాలని కోరగా, అందుకు నేపాల్ బృందం సానుకూలంగా స్పందించింది. నేపాల్ ఉన్నతస్థాయి బృందం విశాఖలో పర్యటించి ఇక్కడి వసతులను పరిశీలించింది. విశాఖ పోర్టుతోపాటు ఇక్కడ రైల్వే, రోడ్డు, వాయు మార్గాలను పరిశీలించిన నేపాల్ అధికారులు స్ధానిక అధికారుల నుంచి తమకు కావలసిన సమాచారాన్ని పొందారు. 
 
కోల్‌క‌తాతో పోల్చుకుంటే విశాఖ నేపాల్ మధ్య దూరం రెట్టింపు ఉంటుంది. ఐతే కోల్‌కతాలో ఉన్న పరిస్థితుల కారణంగా విశాఖ నుంచి తమకు కావలసిన వస్తువులను రోడ్డు, రైలు, వాయు మార్గాల ద్వారా దిగుమతి చేసుకోవడానికి అనువైన పరిస్థితులు ఉన్నట్లుగా నేపాల్ బృందం ఒక అంచనాకు వచ్చింది. ఇక్కడి పరిస్థితులను సమీక్షించిన అనంతరం నేపాల్ బృందం విశాఖ నుంచి ఆపరేట్ చేసేందుకు రంగం సిద్ధ‌ చేస్తున్నట్లు తెలుస్తోంది.