గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By JSK
Last Modified: శుక్రవారం, 6 మే 2016 (23:40 IST)

ఐటీ నగరాలుగా విశాఖ, తిరుపతి, అమరావతి... చంద్రబాబునాయుడు

అమరావతి, మే 6: విశాఖ, తిరుపతి, అమరావతి నగరాలకు సమ ప్రాధాన్యం ఇస్తూ వాటిని ఐటీ సిటీలుగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు సూచించారు. శుక్రవారం మధ్యాహ్నం ముఖ్యమంత్రి ఐటీ ప్రమోషన్స్, ఎలక్ట్రానిక్ మాన్యుఫాక్చరింగ్, ఇన్నోవేషన్స్, స్టార్టప్స్, ఇ-గవర్నెన్స్, మీసేవ, ఇ-ప్రగతి పురోగతిపై అధికారులతో సమీక్షా సమావేశం జరిపారు. ప్రపంచంలోని టాప్ ఐటీ కంపెనీలతో సంప్రదింపులు జరిపే ప్రక్రియను వెంటనే ఆరంభించాలని ఆదేశించారు. మూడు ప్రధాన నగరాలలో ఐటీ కంపెనీలకు అనువైన స్థలాలను కేటాయించేందుకు సిద్ధం చేయాలని చెప్పారు. కేవలం బడా ఐటీ కంపెనీలే కాకుండా వినూత్న ఆలోచనలతో ముందుకువచ్చే చిన్నతరహా ఐటీ కంపెనీలకు కూడా ప్రోత్సాహం అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా  వున్నదని తెలిపారు.
 
విశాఖనగరంలో మిలీనియం టవర్స్ నిర్మాణ పనుల్లో పురోగతి గురించి ముఖ్యమంత్రి ఈ సమావేశంలో ఆరాతీశారు. పనుల్లో అంతులేని జాప్యాన్ని సహించబోనని చెబుతూ, మిలీనియం టవర్స్ నిర్మాణాన్ని వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. విశాఖలోనే కాకుండా అమరావతి, తిరుపతి నగరాలలో కూడా మిలీనియం టవర్స్ నిర్మాణాలకు సంకల్పించినట్టు చెప్పారు. 133 ప్రభుత్వ విభాగాలలో అన్నిరకాల సేవలను డిజిటలైజ్ చేసే ప్రక్రియను శీఘ్రగతిన పూర్తిచేయాలని సీయం కోరారు. ప్రభుత్వ విభాగాలలో డిజిటలైజేషన్ పూర్తయితేనే అభివృద్ధి, సంక్షేమ ఫలాలు ప్రజలందరికీ సమంగా అందుతాయని అభిప్రాయపడ్డారు.
 
2014-15లో ఏపీ నుంచి ఐటీ ఎగుమతుల టర్నోవర్ రూ.1850కోట్లు వుంటే, 2015-16లో 2,450 కోట్లు వున్నదని అధికారులు ఈ సమావేశంలో ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చారు. 2014-15లో ఉద్యోగ కల్పన 2,361 అయితే, 2015-16లో 2,450మందికి ఉద్యోగాలు దక్కినట్టు వివరించారు. 2014-15లో మొత్తం 25,757మందికి శిక్షణ అందిస్తే, ఆ సంఖ్య 2015-16లో 18,363గా వున్నదని చెప్పారు. ఈ రెండేళ్లకాలంలో 600మందికి బహుళజాతి సంస్థలలో ఉద్యోగాలు లభించినట్టు తెలిపారు.
 
ఐటీ ప్రమోషన్స్ కోసం 40 వేల చదరపు అడుగుల మేర ఆఫీసు స్పేస్ సిద్ధం చేసినట్టు అధికారులు తెలిపారు. ప్లగ్ అండ్ ప్లే విధానంలో 3 ప్రధాన నగరాల్లో కలిపి లక్షా 30 వేల చదరపు అడుగుల స్థలాన్ని సిద్ధం చేస్తున్నట్టు చెప్పారు. విశాఖ ఐటీ సెజ్‌లో 2 లక్షల చదరపు అడుగులు, విజయవాడ మేధా టవర్స్‌లో లక్ష చదరపు అడుగులు, విశాఖ ఉడా పరిధిలో 25 వేల చదరపు అడుగులు, ఇతర ప్రాంతాలలో మరో 50 వేల చదరపు అడుగులు చొప్పున మొత్తం 5లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఆఫీస్ స్పేస్ సిద్ధం చేస్తున్నామని అధికారులు వివరించారు.
 
విప్రో, టెక్ మహీంద్ర కంపెనీలు ఏపీలో అడుగు పెట్టాయని, కాగ్నిజెంట్ కంపెనీ ఈ నెలలోనే తన కార్యకలాపాలను ప్రారంభించేందుకు సన్నాహాలు చేసుకుంటుందని, మరికొన్ని కంపెనీలు కూడా ఆసక్తి కనబరుస్తున్నాయని అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువచ్చారు. తిరుపతి నగరంలో ఎలక్ట్రానిక్ మాన్యుఫాక్చరింగ్ క్లష్టర్ల ఏర్పాటుకు డీపీఆర్ సిద్ధం చేసినట్టు తెలిపారు. విశాఖనగరంలో కూడా ఈఎంసీ ఏర్పాటుచేస్తున్నట్టు చెప్పారు. విశాఖ, తిరుపతి, కాకినాడల్లో 3 ఇంక్యుబేషన్ కేంద్రాలను ప్రారంభిస్తున్నామని తెలిపారు. ఈ ఇంక్యుబేషన్లలో 50కి పైగా స్టార్టప్స్ వస్తున్నాయని అన్నారు. 
 
ఏపీలో ఐటీ పరిశ్రమ వేళ్లూనుకునేందుకు ఐటీ, ఎలక్ట్రానిక్ పాలసీలను అవసరమైతే మరింత సరళీకృతం చేయాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. ఐటీ సింగిల్ విండో పాలసీ గురించి ప్రపంచవ్యాప్తంగా వున్న అన్ని ఐటీ కంపెనీలకు సమాచారం అందించాలని అన్నారు.
 
విశాఖపట్టణంలో ఐటీఐఆర్ ఏర్పాటుకు సహకరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నామని, చాలాకాలంగా పెండింగ్‌లో వున్న ఈ ప్రతిపాదన త్వరలో కార్యరూపం దాల్చేలా కేంద్రం సహకరించాలని ముఖ్యమంత్రి అన్నారు. అలాగే, ప్రత్యేక ఎన్ఐసీ కావాలని అడుగుతున్నామని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి వున్న టెలికాం సర్కిల్‌ను విడదీసి ఏపీకి ప్రత్యేకంగా ఏర్పాటుచేయాలని కోరుతున్నామని చెప్పారు. దీనిపై సత్వరం కేంద్రం నిర్ణయం తీసుకునేలా అధికారులు సంప్రదింపులు జరపాలని సూచించారు. 
 
విజయవాడలో సూపర్ కంప్యూటర్ వ్యవస్థను తక్షణం ఏర్పాటుచేయడానికి అధికారులు ప్రయత్నించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఈ సమావేశంలో ఐటీ మంత్రి పల్లె రఘునాధరెడ్డి, సీఎంవో సంయుక్త కార్యదర్శి ప్రద్యుమ్న తదితరులు పాల్గొన్నారు.