గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By CVR
Last Updated : సోమవారం, 3 ఆగస్టు 2015 (12:36 IST)

ఓటుకు నోటు కేసు: రేవంత్‌కి ఎదురు దెబ్బ... సెబాస్టియన్, ఉదయసింహలకు స్వల్ప ఊరట

ఓటుకు నోటు కేసులో ప్రధాన నిందితుడు, తెలంగాణ టీడీపీ ఉపనేత రేవంత్ రెడ్డికి మరోసారి ఎదురు దెబ్బ తగిలింది. అయితే ఈ కేసులో నిందితులుగా ఉన్న సెబాస్టియన్, ఉదయసింహలకు స్వల్ప ఊరట లభించింది. ఈ కేసులో బెయిల్ షరతులను సడలించాలన్న రేవంత్ పిటిషన్‌ను ఏసీపీ ప్రత్యేక కోర్టు తోసిపుచ్చింది. ఈ మేరకు సోమవారం మధ్యాహ్నం  ఏసీబీ కోర్టు తన నిర్ణయాన్ని వెల్లడించింది. ఇప్పటికే ఈ విషయంలో రేవంత్ రెడ్డికి హైకోర్టులో చుక్కెదురైన విషయం తెలిసిందే.
 
కొడంగల్‌కే పరిమితం కావాలన్న షరతుతో రేవంత్‌కి హైకోర్టు బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. అయితే టీడీపీ శాసనసభాపక్ష ఉపనేతగా ఉన్న తాను హైదరాబాదులో ఉండాల్సిన అవసరమున్న నేపథ్యంలో ఆ షరతును సడలించాలని రేవంత్ రెడ్డి హైకోర్టును కోరారు. ఈ కేసు సోమవారం విచారణకు వచ్చింది. అప్పుడు రేవంత్ రెడ్డి హైదరాబాదులో ఉంటే, సాక్ష్యాలను తారుమారు చేసే ప్రమాదముందని ఏసీబీ అధికారులు వాదించారు. ఇరు తరపు వాదనలు విన్న హైకోర్టు రేవంత్ రెడ్డి వినతిని తోసిపుచ్చింది. దీంతో మరికొంతకాలం పాటు రేవంత్ రెడ్డి కొడంగల్‌కే పరిమితం కాక తప్పని పరిస్థితి నెలకొంది.
 
ఇదే కేసులో నిందితులుగా ఉన్న సెబాస్టియన్, ఉదయసింహల బెయిల్ షరతులను కోర్టు కొంతమేర సడలించింది. ఇక నుంచి ఈ కేసులో ప్రతిరోజు కాకుండా వారంలో సోమవారం, గురువారం, శుక్రవారం మాత్రమే ఏసీబీ అధికారుల ఎదుట హాజరుకావాలని తెలిపితూ ఏసీబీ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.