మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pyr
Last Updated : శుక్రవారం, 31 జులై 2015 (10:55 IST)

రిషితేశ్వరీ కేసులో దోషులను వదిలే ప్రసక్తే లేదు.. మంత్రి గంటా

రిషితేశ్వరీ ఆత్మహత్యకు కారణమైన వారు ఎంతటి వారైనా, వారు ఎన్ని ప్రయత్నాలు చేసినా వారిని శిక్షించి తీరుతామని ఆంధ్రప్రదేశ్ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. శుక్రవారం ఉదయం రిషితేశ్వరీ తల్లిదండ్రులు విజయవాడలో ఆయనను కలిశారు.  ఈ సందర్భంగా తమకు న్యాయం చేయాలని మరో అమ్మాయికి ఈ పరిస్థితి రాకుండా చూడాలని వారు మంత్రిని కోరారు.
 
ఈ సందర్భంగా మంత్రి గంటా మాట్లాడుతూ, నిందితులు ఎలాంటి ప్రయత్నాలు చేసినా ప్రభుత్వం ఉపేక్షించబోదని తెలిపారు. ఇప్పటికే దానిపై కమిటీ వేసి విచారణ జరిపిస్తున్నామని చెప్పారు. రిషతేశ్వరీ విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా చాలా స్పష్టంగా ఉన్నారని చెప్పారు. 
 
అదే సమయంలో రాష్ట్రంలోని వర్శిటీలలో జరుగుతున్న ర్యాగింగ్ పై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినట్లు వివరించారు. యూనివర్శిటీలలో ర్యాగింగ్‌లు జరిగే తీరుపై తిరుపతిలో సమీక్ష జరిపినట్లు ఆయన చెప్పారు. అయితే రిషితేశ్వరీ కేసులో చాలా నిష్ఫక్షపాతంగా చర్యలు తీసుకుంటామని ఆమె తల్లిదండ్రులకు ఆయన హామీ ఇచ్చారు.