శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Modified: సోమవారం, 10 జూన్ 2019 (20:45 IST)

రోజమ్మకి కీలక పదవి ఇవ్వాలి... ఎలా? సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆలోచన

వైసీపీ అధికారంలోకి రాగానే ఎమ్మెల్యే ఆర్కే రోజాకి ఖచ్చితంగా పదవి వస్తుందని అనుకున్నారు. కానీ అనూహ్యంగా ఆమెకి పదవి రాకుండా పోయింది. నగరి ఎమ్మెల్యే ఆర్కే.రోజాకు మంత్రివర్గంలో చోటు దక్కక పోవడంతో ఆమె ఖంగుతిన్నారు. దీంతో శనివారం ఉదయం జరిగిన మంత్రుల ప్రమాణ స్వీకారానికి కూడా రాలేదు. పైగా, ఆమె అలకపాన్పుఎక్కి, కనిపించకుండా పోయారు.
 
దీంతో రోజాను బుజ్జగించేందుకు స్వయంగా వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి రంగంలోకి దిగి బుజ్జగించారు. చివరకు ఆర్టీసీ ఛైర్మన్ పదవిని ఇస్తామని హామీ ఇచ్చినా రేపోమాపో దాన్ని ప్రభుత్వం విలీనం చేస్తున్న నేపధ్యంలో ప్రాధాన్యత అంత వుండదని రోజా వెనకడుగుకు వేసినట్లు తెలుస్తోంది. 
 
అయితే, రోజా ఎమ్మెల్యేగా విజయం సాధించిన నేపథ్యంలో, గెలిచిన అభ్యర్థులు ఇలాంటి నామినేటెడ్ పదవులు చేపట్టడంలో రాజ్యాంగపరమైన అడ్డంకులను వైసీపీ అధినాయకత్వం పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. మరోవైపు, మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ పదవి కూడా రోజా ముందు ఓ ఆప్షన్‌లా ఉంచారని ప్రచారం జరుగుతోంది. ఇవన్నీ రోజాకున్న పాపులారిటీ నేపధ్యంలో మరీ చిన్నపదవులుగా తోచడంతో ఎలాంటి పదవి ఇస్తే బాగుంటుందన్న ఆలోచనలో పడినట్లు తెలుస్తోంది. మరి ఆమెకి ఎలాంటి పదవి ఇస్తారో చూడాలి.