గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Raju
Last Modified: మంగళవారం, 17 జనవరి 2017 (16:01 IST)

నారావారిపల్లెలో వైకాపా చెవిరెడ్డి.. ఏమీ జరగలేదట

ఆంధ్రప్రదేశ్‌లో పాలక తెలుగుదేశం పార్టీపై ఇంతెత్తును ఎగిరిదుమికే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి ఉన్నట్లుండి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సొంత గ్రామం నారావారిపల్లెలో దర్శనమచ్చి అందరినీ కలవరపర్చారు. చంద్రగిరి నియోజకవర్గ శాస

ఆంధ్రప్రదేశ్‌లో పాలక తెలుగుదేశం పార్టీపై ఇంతెత్తును ఎగిరిదుమికే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి ఉన్నట్లుండి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సొంత గ్రామం నారావారిపల్లెలో దర్శనమచ్చి అందరినీ కలవరపర్చారు. చంద్రగిరి నియోజకవర్గ శాసనసభ్యుడైన చెవిరెడ్డి నారావారిపల్లెలో ముఖ్యమంత్రి చంద్రబాబు చేయనున్న తొలి ఎటీఎం కేంద్రం శంకుస్థాపన కార్యక్రమానికి విచ్చేశారు.
 
ముఖ్యమంత్రి సొంత గ్రామంలో వైకాపా ఎమ్మెల్యే ఉన్నట్లుండి ప్రత్యక్షం కావడంతో బందోబస్తులో ఉన్న పోలీసులు కాస్సేపు ఉత్కంఠకు గురైనప్పటికీ ఆయన్ని అడ్డుకోలేకపోయారు. కారణం.  చెవిరెడ్డి చంద్రగిరి నియోజకవర్గ ఎమ్మెల్యేగా అక్కడికి రావడమే. నారావారిపల్లె ఆయన నియోజకవర్గ పరిధిలోనిదే కావడం తెలిసిందే.
 
చంద్రబాబు స్థానిక ప్రజలతో, టీడీపీ కార్యకర్తలతో మాట్లాడుతూ, తన నివాసానికి సమీపంలో టీటీడీ కల్యాణ మండపంలో పిటిషన్లు అందుకుంటూ గడిపారు. ముఖ్యమంత్రిని కలవడానికి వచ్చే ప్రజల కోసం అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు. ముఖ్యమంత్రి అధికారిక కార్యక్రమానికి ఎంతో ముందుగానే అక్కడికి వచ్చిన చెవిరెడ్డి తన అనుయాయులతో కలిసి అదే టీడీడీ కల్యాణ మండపంలోకి వచ్చి కూర్చున్నారు. 
 
అయితే అదృష్టవశాత్తూ చెవిరెడ్డి అక్కడ ఎలాంటి గలాభా సృష్టించలేదు. ఎంతోకాలంగా పెండింగులో ఉన్న చంద్రగిరి ప్రాంత ఆసుపత్రిని అభివృద్ధి చేయాలంటూ ముఖ్యమంత్రికి పిటిషన్ ఇచ్చాక అక్కడినుంచి వెళ్లిపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు