శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By PNR
Last Updated : మంగళవారం, 21 అక్టోబరు 2014 (10:13 IST)

ప్రియుడితో కలిసి భర్తను కడతేర్చిన భార్య!

కర్నూలు జిల్లా పత్తికొండలో కట్టుకున్న భర్తను ప్రియుడితో కలిసి ఓ కసాయి భార్య కడతేర్చింది. తమ వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భావించి తన ప్రియుడితో కలిసి ఈ దారుణానికి ఒడిగట్టింది. ఆదివారం అర్థరాత్రి జరిగిన ఈ దారుణం స్థానికంగా పెను సంచలనం సృష్టించింది. పత్తికొండ పోలీసులు, మృతుడి బంధువుల కథనం మేరకు వివరాలిలావున్నాయి. 
 
పత్తికొండ పట్టణం ఆదోని రోడ్డు పెట్రోలు బంకుకు సమీపంలో సవారమ్మ కాలనీకి చెందిన చిట్టెమ్మ, మడ్డిగేరి కాలనీకి చెందిన బీటీ దస్తగిరి (30) అనే వారు తొమ్మిదేళ్ళ క్రితం ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు విజయ్‌కుమార్, విజయలక్ష్మి ఉన్నారు.
 
భార్యభర్తలిద్దరూ తోపుడుబండిపై పండ్లు, కూరగాయల విక్రయిస్తూ జీవనం సాగిస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో చిట్టెమ్మకు ఇంటింటికీ తిరిగి పాలు అమ్మే మడ్డిగేరికి చెందిన పాల ఇమాం హుస్సేన్‌తో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఇది తెలుసుకున్న దస్తగిరి  పలుమార్లు మందలించినప్పటికీ చిట్టెమ్మ ప్రవర్తనలో మార్పు రాలేదు. 
 
దీంతో చిట్టెమ్మతో పాటు.. హుస్సేన్‌తో దస్తగిరి తరచూ గొడవపడుతూ ఉండేవాడు. దీంతో అతని అడ్డుతొలగించుకుంటే తమ బంధం సజావుగా సాగుతుందని భావించిన చిట్టెమ్మ తన ప్రియుడితో కలిసి వ్యూహరచన చేసింది. ఆ ప్రకారంగా ఆదివారం అర్థరాత్రి ఇంట్లో నిద్రిస్తున్న భర్త తలపై బండరాయితో మోది హత్య చేసింది. 
 
ఆ తర్వాత హత్యకు సంబంధించిన ఆనవాళ్లు లేకుండా చేసి.. శవాన్ని బెడ్‌షీట్‌లో చుట్టి, గోనెసంచెలో వేసుకుని బైపాస్‌ రోడ్డులో ఉన్న హంద్రీ-నీవా కాలువలో వేసేందుకు బయల్దేరారు. కాలనీ చివర్లో వీరు తచ్ఛాడుతుండగా నైట్‌బీట్‌కు వెళ్లిన కానిస్టేబుళ్లకు అనుమానం వచ్చి, ఇంటి వద్దకు వెళ్లి చూడగా హత్యోదంతం వెలుగు చూసింది. 
 
సమాచారం తెలుసుకున్న సీఐ నారాయణస్వామి రెడ్డి, ఎస్‌ఐ ప్రియతం రెడ్డి సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. చిట్టెమ్మను అదుపులోకి తీసుకుని విచారించగా, తన భర్తే బండరాయితో కొట్టుకుని చనిపోయాడని తొలుత బుకాయించింది. అయితే, పోలీసులు తమదైన శైలిలో విచారణ చేయడంతో  నేరాన్ని ఒప్పుకుంది. మృతుడి బంధువుల ఫిర్యాదుతో చిట్టెమ్మ, ఆమె ప్రియుడినీ అరెస్ట్ చేసి హత్యానేరం కింద కేసు నమోదు చేసినట్లు సీఐ నారాయణస్వామి రెడ్డి విలేకరులకు తెలిపారు.