శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : గురువారం, 26 మే 2016 (14:53 IST)

అదనపు కట్నం కోసం ఎన్నారై భర్త వేధింపులు.. పడకగది ఫోటోలు నెట్లో పెట్టేస్తానంటూ!?

ఎన్నారై కదా విదేశాల్లో చేతినిండా సంపాదిస్తాడని కూతుర్ని కట్టబెట్టిన ఆ తండ్రికి చివరికి కష్టాలే మిగిలాయి. కన్నకూతురు అల్లుడి వేధింపులు భరించలేక స్వదేశానికి వచ్చేయడం కొంత సంతోషాన్నిచ్చినా.. అదనపు కట్నం కోసం తరచూ వేధించే అతడికి తన బిడ్డనిచ్చి ఆమె జీవితాన్ని నాశనం చేశానని ఆ తండ్రి బాధపడుతున్నారు. ఇంకా న్యాయం కోసం హెచ్చార్సీని ఆ తండ్రీకూతుళ్లు ఆశ్రయించారు. 
 
వివరాల్లోకి వెళితే.. నారాయణ గూడ తాడ్‌బన్‌, బషారత్‌నగర్‌, రంజన్‌ కాలనీకి చెందిన మిర్జా ఖాలీద్‌ అలీ బేగ్‌ తనయుడు ప్రస్తుతం ఖతార్‌ (అరబ్‌ దేశం)లో ఇంజినీర్‌గా పనిచేస్తున్న మిర్జా అర్షద్‌ అలీ బేగ్‌తో కిషన్‌బాగ్‌, చిరాగ్‌అలీ నగర్‌కు చెందిన ఇష్రాత్‌ బేగంకు పది నెలల క్రితం వివాహమైంది. భర్త అర్షద్ అలీ బేగ్ తనను ఖతార్ రావాలని వీసా పంపించడంతో అక్కడకు వెళ్ళింది. అక్కడికి వెళ్ళాక ఆయన నిజస్వరూపం ఏమిటో బయటపడిందని.. కారు కొనాలని రూ.2లక్షలు ఇవ్వాలని వేధించాడని బాధితురాలు హెచ్చార్సీలో ఫిర్యాదు చేసింది. 
 
రూ.2లక్షలిచ్చాక మళ్ళీ రూ.3 లక్షలు అడిగాడని.. ఇలా ఎప్పుడుపడితే అప్పుడు డబ్బు తేవాల్సిందిగా వేధించాడని.. కానీ తండ్రి పరిస్థితి బాగాలేకపోవడంతో ఇక చేసేది లేక హెచ్చార్సీని ఆశ్రయించానని తెలిపింది. రూ.3లక్షలు ఇవ్వకపోతే.. పడకగదిలో తనకు తెలియకుండా తీసిన కొన్ని చిత్రాలను సామాజిక మాధ్యమాల్లో అప్‌లోడ్ చేస్తానంటూ బెదిరిస్తున్నాడని బాధితురాలు వాపోయింది. భర్త వేధింపుల్లో గర్భస్రావం అయ్యిందని.. అతని హింస భరించలేక స్వదేశానికి వచ్చేసినట్లు చెప్పింది.  
 
అందుచేత ఎన్నారై భర్తపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, ఆయన్ను భారత్‌కు రప్పించాలంటూ ఇష్రాత్‌ బేగం రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయించారు. కేసు విచారణకు స్వీకరించిన కమిషన్‌ జులై 19 లోపు నివేదిక ఇవ్వాలని పోలీసు శాఖకు ఆదేశించింది.