గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Raju
Last Updated :హైదరాబాద్ , గురువారం, 2 ఫిబ్రవరి 2017 (04:38 IST)

పవన్ జగన్ కలిసి పనిచేస్తారట? కానీ పవన్‌ని నమ్మేదెలా? వైకాపా అంతర్మథనం

ఏపీ ప్రత్యేక హోదా కోసం తాను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేయడానికి కూడా సిద్దమే అంటూ జనసేన అధ్యక్షుడు, సినీ హీరో పవన్ కల్యాణ్ ప్రకటించడం రాజకీయ వర్గాల్లో సంచలనం కలిగించింది కానీ వైఎస్ జగన్‌తో

ఏపీ ప్రత్యేక హోదా కోసం తాను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేయడానికి కూడా సిద్దమే అంటూ జనసేన అధ్యక్షుడు, సినీ హీరో పవన్ కల్యాణ్ ప్రకటించడం రాజకీయ వర్గాల్లో సంచలనం కలిగించింది కానీ వైఎస్ జగన్‌తో కలిసి పవన్ పనిచేయటం అంత సులభం కాదని క్షేత్ర వాస్తవాలు తెలుపుతున్నాయి. పవన్ అలా ప్రకటించిన తర్వాత వైఎస్సార్సీపీ నుంచి ఆయన పట్ల తొలిసారిగా సానుకూలత వ్యక్తమవుతోంది. అయితే పవన్ తన మాట మీద చివరిదాకా నిలబడతాడా అనేది అసలు ప్రశ్న. 
 
ఎందుకంటే, మొదటి నుంచీ పవన్‌కళ్యాణ్‌కి టీడీపీ అంటే అదో ఇది. బీజేపీతోనూ, టీడీపీతోనూ ఇప్పటికీ ఆయన సఖ్యత కొనసాగుతోంది. 2014 ఎన్నికల్లో పవన్‌కళ్యాణ్‌ ఫ్యాక్టర్‌ పనిచేయకపోయి వుంటే, ఆంధ్రప్రదేశ్‌లో ఖచ్చితంగా వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చి వుండేదే. దానికి నిదర్శనం, ఆ ఎన్నికల్లో టీడీపీకీ, బీజేపీకీ మధ్య ఓట్ల తేడా అతి తక్కువ కావడమే. అయినాసరే, రాజకీయాల్లో గెలుపు గెలుపే.. ఓటమి ఓటమే.! 
 
అసలు విషయానికొస్తే, 2019 ఎన్నికల్లో ప్రత్యేక హోదా అత్యంత కీలకమైన అంశం కాబోతోందని వైఎస్సార్సీపీ మొదటినుంచి చెబుతోంది. ఈ విషయం బీజేపీ, టీడీపీలకూ బాగా తెలుసు. అందుకే, ఈలోగా ప్రత్యేక హోదా అంశాన్ని పూర్తిగా నీరుగార్చేయాలనీ, ప్రజలెవరూ దాని గురించి ఆలోచించకుండా మసిపూసి మాయచేసెయ్యాలనీ చూస్తున్నాయి. అయితే, ఇక్కడే జనసేన రూపంలో, వైఎస్సార్సీపీ రూపంలో ప్రత్యేక హోదా విషయమై ఆ రెండు పార్టీలకూ ఇబ్బందులెదురవుతున్నాయి. 
 
ఇదే మంచి సమయం, వైఎస్‌ జగన్‌ ఓ అడుగు ముందుకేసి పవన్‌కళ్యాణ్‌తో మంతనాలు జరపడానికి. ఎటూ పవన్‌ నుంచి, 'ఏ రాజకీయ పార్టీతో అయినా సరే ప్రత్యేక హోదా కోసం కలిసి పనిచేయడానికి సిద్ధం' అనే ప్రకటన వచ్చింది గనుక, వైఎస్‌ జగన్‌.. తమ పార్టీ బృందాన్ని పవన్ వద్దకు పంపేందుకు సిద్ధం చేసుకోవడం ఉత్తమం. తద్వారా ప్రత్యేక హోదా ఉద్యమానికి ఊపు వస్తుంది. అదే సమయంలో, బీజేపీ - టీడీపీలపై రాజకీయ ఒత్తిడి కూడా పెరుగుతుంది. 
 
ఇక్కడ బేషజాలేమీ లేవు, ప్రతిపక్ష నేతగా అందర్నీ కలుపుకుపోవడం వైఎస్‌ జగన్‌ బాధ్యత. విపక్షాల్ని ఐక్యం చేయగలిగితే, నాయకుడిగా జగన్‌ ఓ మెట్టు పైకెక్కినట్లే అవుతుంది తప్ప, ఎవరికోసమో దిగివచ్చినట్లవదు. కానీ, పవన్‌ని నమ్మేదెలా. ఇక్కడే, వైఎస్‌ జగన్‌ ఆలోచనలు ఆగిపోతుండొచ్చు. నిజమే మరి, పవన్‌కళ్యాణ్‌ ఎప్పుడెలా వ్యవహరిస్తారో ఎవరూహించగలరు. కానీ, జగన్‌ తాను చేయాల్సిన ప్రయత్నం చెయ్యాల్సిందే.