గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pyr

స్పీకర్ కు వైసిపి నుంచి వరుస సారీలు

స్పీకర్ పై చేసిన అనుచిత వ్యాఖ్యలు ఉద్దేశ్య పూర్వకంగా చేసినవి కావని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు వరుసగా గురువారం శాసనసభలో స్పీకర్ శివప్రసాద్ రావును క్షమాపణలు కోరారు. ఒక్కొక్కరు లేచి నిలబడి తమ వ్యాఖ్యలు పనిగట్టుకుని చేసినవి కావనీ, బాధతో వచ్చినవేనని అయినా అందుకు చింతిస్తున్నాం. క్షమించండి అంటూ కోరడం కనిపించింది. 
 
తొలత రోజా మాట్లాడుతూ ఆరోజు మా సభ్యులు సస్పెండ్‌కు గురవ్వడంతో అందరం భావోద్వేగాలకు లోనయ్యామని, మా వ్యాఖ్యలతో సభాపతి బాధపడ్డారని, తండ్రిలాంటి స్పీకర్‌కు క్షమాపణ చెప్పడంలో ఎటువంటి అభ్యంతరం లేదని, మీ మనసు బాధపడి ఉంటే చింతిస్తున్నామని రోజా చెప్పారు.
 
శ్రీకాంత్‌రెడ్డి మాట్లాడుతూ రాజకీయ పార్టీల్లో ఎవరి పట్టుదలలు వారికి ఉంటాయని అన్నారు. ఇక్కడ స్పీకర్‌కు సంబంధించిన అంశం వచ్చింది కాబట్టి సభాపతిని గౌరవించాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఈనెల 19న జరిగిన సంఘటన ఉద్దేశపూర్వకంగా చేయలేదన్నారు. ఆరోజు జరిగిన సంఘటనలపై విచారం వ్యక్తం చేస్తున్నామన్నారు. భవిష్యత్‌లో స్పీకర్‌ ఛైర్‌ను కాపాడతామని, సభాపతి గౌరవాన్ని పెంచే విధంగా ఉంటామని శ్రీకాంత్‌రెడ్డి మరొకసారి విచారం వ్యక్తం చేశారు.
 
చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి మాట్లాడుతూ ఆవేశంలో భార్యను తిట్టినా.. తర్వాత క్షమాపణ చెప్పుకుంటామని అలాంటి సంస్కృతి మనకు ఉందని అన్నారు. జడ్జి స్థానంలో ఉన్నటువంటి స్పీకర్‌ను ఆవేశంలో మాట్లాడామని, ఉద్దేశపూర్వకంగా అనలేదని, స్పీకర్‌ మనసు గాయపడడంతో క్షమాపణ చెబుతున్నట్లు వెల్లడించారు. క్షమాపణ చెప్పడం గౌరవంగా భావిస్తున్నామని చెవిరెడ్డి అన్నారు. 
 
కె. శ్రీధర్‌ రెడ్డి మాట్లాడుతూ స్పీకర్‌పై దురుసుగా మాట్లాడినందుకు పశ్చాత్తాపం వ్యక్తం చేస్తున్నట్లు చెప్పారు. ముత్యాల నాయుడు మాట్లాడుతూ సభాపతిపై పరుషపదజాలం ఉపయోగించినట్లైతే పెద్దలు గౌరవిస్తూ మమ్మల్ని క్షమించాలని కోరుతున్నట్లు చెప్పారు. భవిష్యత్‌లో ఇలా జరగకుండా చూస్తామని సభాముఖంగా తెలియస్తున్నామన్నారు. 
 
నాని మాట్లాడుతూ 19న జరిగిన సంఘటనలో ఉద్దేశపూర్వకంగా వ్యాఖ్యలు చేయలేదని, వ్యక్తిగతంగా స్పీకరంటే గౌరవం ఉందని, అధ్యక్ష స్థానమన్నా గౌరవం ఉందని, మేము చేసిన వ్యాఖ్యలకు సభాపతి మనసు బాధపడిఉంటే క్షమించాలని.. ఆ వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటామని 9మంది ఎమ్మెల్యేలు స్పీకర్‌కు క్షమాపణలు చెప్పారు.
 
సభాపతి కోడెల శివప్రసాద్‌ మాట్లాడుతూ ఎవరు ఎంత చేసినా.. తప్పు చేశామనే భావన, దానికి పశ్చాత్తాపం, క్షమాపణ.. అంతకంటే మించిన శిక్ష లేదని అన్నారు. స్పీకర్‌ స్థానాన్ని కించపరిచారనే బాధ పడ్డానని ఆయన అన్నారు. పశ్చాత్తాపం వ్యక్తం చేశారు కాబట్టి ఉపశమనం కలిగిందని కోడెల అన్నారు. అందరం కలిసికట్టుగా నడుద్దామని ఆయన పిలుపు ఇచ్చారు.