శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By PNR
Last Updated : బుధవారం, 2 సెప్టెంబరు 2015 (11:07 IST)

జగన్ - హరీష్ భేటీ ఫోటోలు.. సరైన సమయంలో బయటపెడతాం : యనమల

ఓటుకు నోటు కేసులో కుట్రపన్నేందుకు వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డి, టీ మంత్రి హరీష్‌ రావులు రహస్య భేటీకి సంబంధించిన ఫోటోలను అవసరమైనపుడు, సరైన సమయంలో బహిర్గతం చేస్తామని ఏపీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు వెల్లడించారు. ఆయన బుధవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ జగన్ - హరీష్‌లు సమావేశం అయ్యారనడానికి తమ వద్ద సాక్ష్యాలు ఉన్నాయని, అవి ఎప్పుడు పడితే అప్పుడు బయటకు రావన్నారు. 
 
"పాము పుట్టలో ఉంది. అది అవసరమైనప్పుడు మాత్రమే బయటకు వస్తుంది. జగన్, తెరాస నేతల భేటీ సాక్ష్యాలు కూడా అంతే" అని ఆయన అన్నారు. నేటి అసెంబ్లీలో యనమల, మరో మంత్రి అచ్చెన్నాయుడి మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. తాను నిన్న జగన్, టీఆర్ఎస్ లీడర్లు సమావేశమైన తేదీని వెల్లడించానని, ఆ దృశ్యాలను తొలగించారని అచ్చెన్నాయుడు ఆరోపించారు. దీనికి స్పందించిన యనమల, తొలగించడానికి ముందే ఆ దృశ్యాలను సేకరించి పెట్టామని, అవసరమైనప్పుడు మాత్రం అవి బయటకు వస్తాయన్నారు. 
 
ఇకపోతే.. తెలంగాణ ప్రభుత్వం చర్చలకు రాకపోవటం వల్లే సమస్యలు పరిష్కారం కావట్లేదన్నారు. ఉద్యోగుల విభజన తొందరగా పూర్తి చేయాలని ఇప్పటికే షీలా బేడీ కమిటీ కోరామన్నారు. కేంద్రం జోక్యం చేసుకుని ఇరు రాష్ట్రాల సమస్యలు కూడా పరిష్కారించాల్సి ఉందన్నారు. అసలు రాష్ట్ర విభజన చట్టంలోనే లోపాలున్నాయని అన్నారు. అన్ని లోపాలను సరిచేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరినట్టు యనమల తెలిపారు.