గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : శనివారం, 23 ఆగస్టు 2014 (10:40 IST)

జగన్ 'బఫూన్'పై అసెంబ్లీలో గొడవ...: రెండో రోజు కూడా అదే తంతు!

తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలను ఉద్దేశించి అసెంబ్లీ సాక్షిగా తాను చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకునే ప్రసక్తే లేదని, శుక్రవారం సభలో తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడివున్నట్టు వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డి శనివారం ప్రకటించారు. దీంతో బఫూన్ వ్యాఖ్యలపై శనివారం కూడా సభ దద్ధరిల్లిపోయే అవకాశం ఉంది. ఈ అంశంపై టీడీపీ, వైసీపీ సభ్యులిరువురు ఈ విషయంలో మొండిపట్టుదలతో ఉండటంతో అసెంబ్లీలో శనివారం కూడా ఉద్రిక్త పరిస్థితులు తప్పేలా లేవు. 
 
'బఫూన్' వ్యాఖ్యలపై జగన్ తమకు క్షమాపణలు చెప్పాలని టీడీపీ సభ్యులు పట్టుబడుతున్నారు. క్షమాపణలు చెప్పే వరకు సభను సాగనివ్వమని వారు మంకుపట్టు పడుతున్నారు. అలాగే, వైసీపీ అధ్యక్షుడు జగన్ కూడా ఈ విషయంలో ఏమాత్రం తగ్గేలా కనపడటం లేదు. 
 
అసెంబ్లీ‌లో టీడీపీ సభ్యులపై తాను చేసిన బఫూన్ వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని... నిన్న అసెంబ్లీ వాయిదాపడిన తర్వాత జగన్ స్పష్టం చేశారు. అయితే, ముందుగా తన కుటుంబంపై టీడీపీ సభ్యులు చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటే... తాను కూడా తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటానని ఆయన అన్నారు. ఈ విషయంలో తాను ఎలాంటి భేషజాలకు పోదలుచుకోలేదని ఆయన అన్నారు.