గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 22 ఆగస్టు 2014 (23:16 IST)

హత్యల సంఖ్య ఏముందిలే: సాక్షి ప్రశ్నపై జగన్ ఆన్సర్

రాజకీయ హత్యలపైన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చెప్పే సంఖ్యకు, సాక్షి పత్రిక ప్రచురించిన సంఖ్యకు తేడా ఉందని టీడీపీ నేతలు అసెంబ్లీ రచ్చ రచ్చ చేశారు. దీనిపై శుక్రవారం సభ వాయిదా పడిన అనంతరం వైకాపా చీఫ్ జగన్ సమాధానమిచ్చారు. హత్యల సంఖ్య పైన తాను సభను తప్పుదారి పట్టించలేదన్నారు. సంఖ్యలది ఏముందని, మానవీయ కోణంలో చూడాలని జగన్ అన్నారు.  
 
కాగా, ఉదయం శాసన సభలో శాంతిభద్రతల పైన చర్చ జరిగిన విషయం తెలిసిందే. దీని పైన అధికార తెలుగుదేశం, ప్రతిపక్ష వైయస్సార్ కాంగ్రెసు పార్టీల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఇరు పార్టీలు ఒకరి పైన మరొకరు ఆగ్రహం వ్యక్తం చేశాయి. 
 
టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి తమ పార్టీ కార్యకర్తలు హత్యకు గురవుతున్నారని వైకాపా ఆరోపించింది. దీనిపై టీడీపీ కూడా ధీటుగా స్పందించింది. వైయస్ హయాంలోనే చాలా హత్యలు జరిగాయన్నారు. 
 
పరిటాల హత్య కేసులో జగన్ ఉన్నారని ఆరోపించారు. ఓ సమయంలో సభలో ఊగిపోయిన జగన్ టీడీపీ వారిని బఫూన్లు అన్నారు. జగన్ క్షమాపణ చెప్పాలని టీడీపీ డిమాండ్ చేసింది. స్పీకర్ కూడా వాటిని వెనక్కి తీసుకోవాలని సూచించారు.
 
దీనికి జగన్ స్పందిస్తూ.. ఇదే సభలో టీడీపీ సభ్యులు తనను హంతకుడు అన్నారని, నరరూపరాక్షసుడు అన్నారని స్పీకర్‌తో చెప్పారు. తమ ఎమ్మెల్యేలను స్మగ్లర్లు అని కూడా అన్నారన్నారు. తనను అలాంటి ఘోరమైన మాటలతో దూషించిన తర్వాత, తాను వారిని బఫూన్లు అన్నానని సమర్థించుకున్నారు.