మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pyr
Last Updated : శుక్రవారం, 28 ఆగస్టు 2015 (12:16 IST)

పిల్లల్ని ఎలుకలు కొరుక్కు తింటున్నా... మహిళలకు సూదులు గుచ్చుతుంటే ఏం చేస్తున్నారు... సీఎం ఫైర్

తాను ఏమిటో, తన వ్యవహార శైలి ఏమిటో చవిచూడాలని అనుకోకండి... లేదంటే మొద్దు నిద్ర వదిలిస్తా... రాష్ట్రంలో ఇలాంటి సంఘటనలు జరుగుతుంటే ఏం చేస్తున్నట్లు అంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆగ్రహం వ్యక్తం చేశారు. పిల్లలను ఎలుకలు తింటున్నా... మహిళలకు సైకోలు సూది మందు వేస్తున్న చర్యలు లేకపోతే అర్థం ఏంటని మండిపడ్డారు. నిద్రమత్తు వీడాలని హెచ్చరించారు. 
 
క్యాంపు కార్యాలయంలో గురువారం ఆయన విలేకరులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. గతంలో మాదిరిగా కాకుండా ఉద్యోగుల విషయంలో సానుకూలంగా వ్యవహరిస్తున్నానని, అయితే, తానెంతో కష్టపడుతున్నానని, ఉద్యోగుల నుంచి కూడా ఆ స్థాయి కృషి జరగడం లేదని మండిపడ్డారు. ఉద్యోగులు నిర్లిప్తంగా ఉన్నా, నిర్లక్ష్యంగా వ్యవహరించినా గతంలో సహించేవాడిని కాదు. కొందరు రాష్ట్ర ప్రభుత్వ అధికారుల మొద్దు నిద్ర వదిలించటానికి సన్నద్ధంగా ఉన్నానని చెప్పారు. ఉద్యోగుల విషయంలో, మరో మూడు నెలల్లో పాత చంద్రబాబు పెర్‌‌ఫార్మెన్స్‌ చూస్తారని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. 
 
తాను రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి, ఆదాయం తీసుకు రావడానికి 24 గంటలూ కష్టపడుతుంటే, వివిధ ప్రభుత్వ శాఖల నిర్వాకం కారణంగా ప్రభుత్వ పరువు మంటగలుస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గుంటూరు జీజీహెచ్‌లో ఎలుకలు కొరకడం ద్వారా శిశువు మరణించడంపై తీవ్రంగా స్పందించారు. ‘ఆ డాక్టర్‌కు బుద్ధి లేదు’ అంటూ స్పందించారు. 
 
ఇంజక్షన్లు చేసి పారిపోతున్న సైకో ఉదంతాలపై కూడా అంతే తీవ్రంగా స్పందించారు. ఒక సైకో ఇంజక్షన్లు చేసి పారిపోతుంటే పోలీసులు వాడిని పట్టుకోవడానికి భయపడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సైకోను పట్టుకోకపోవడంపై తాను డీజీపీ నుంచి అన్ని స్థాయిల అధికారులతో మాట్లాడి వాయించి పారేశానన్నారు. పనిచేసే అధికారులే తన దగ్గర ఉంటారని, పని చేయని వారిని ఉపేక్షించేది లేదన్నారని తీవ్ర స్థాయిలో హెచ్చరించారు.