గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 14 ఏప్రియల్ 2017 (09:19 IST)

2019లో పులివెందులకే సీఎం పదవి.. అధికారంలోకి రాగానే మీ తాట తీస్తా?

వైకాపా అధినేత వైఎస్.జగన్ మోహన్ రెడ్డి సీఎం పదవిపై ఉన్న కోర్కెను మరోమారు బయటపెట్టారు. "పులివెందుల నియోజకవర్గానికి 2019 ఎన్నికల్లో సీఎం పదవి వస్తుంది. మేం అధికారంలోకి వచ్చిన వెంటనే మీపై వచ్చిన అవినీతి ఆ

వైకాపా అధినేత వైఎస్.జగన్ మోహన్ రెడ్డి సీఎం పదవిపై ఉన్న కోర్కెను మరోమారు బయటపెట్టారు. "పులివెందుల నియోజకవర్గానికి 2019 ఎన్నికల్లో సీఎం పదవి వస్తుంది. మేం అధికారంలోకి వచ్చిన వెంటనే మీపై వచ్చిన అవినీతి ఆరోపణలపై విచారణ జరిపిస్తా. ఇప్పటికైనా జరిగినవి మరచిపోయి నిజాయితీగా పనిచేయండి" అంటూ ఆయన అన్నారు. ఈ మేరకు ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులను హెచ్చరించారు కూడా.  
 
పులివెందుల నియోజకవర్గంలోని లింగాల ఎంపీడీఓ కార్యాలయం వద్ద మండలస్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులతో జగన్‌ ప్రజాదర్బార్‌ నిర్వహించారు. మండలంలోని 16 పంచాయతీల ప్రజాప్రతినిధులు, ప్రజలతో విడివిడిగా సమావేశమయ్యారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈ ప్రజాదర్బార్ జరిగింది. ముఖ్యంగా.. తాగునీటి సమస్యపైనే సమావేశంలో చర్చించారు. తాగునీటి సమస్య తీవ్రంగా ఎక్కడ ఉందో అక్కడ సత్వరమే సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టాలని కోరారు. 
 
ముఖ్యంగా, వేసవి సమీపించడంతో తాగునీటి కొరత ఉన్న గ్రామాల్లో ట్యాంకర్లు ఏర్పాటు చేసైనా నీటిని సరఫరా చేయాలన్నారు. కాగా, సమావేశంలో ఆర్‌డబ్ల్యూఎస్‌ ఏఈపై పలువురు ప్రజలు, ప్రజాప్రతినిధులు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నారు. ఏఈ డబ్బు కోసం పీడిస్తున్నాడని, ఎవరు డబ్బులిస్తే వారి తాగునీటి బిల్లులు త్వరగా వచ్చేలా చూస్తున్నారన్నారు. డబ్బు ఇవ్వని వారిని ఏళ్ల తరబడి తిప్పుకుంటున్నారని ఆరోపించారు. దీనిపై జగన్ స్పందిస్తూ... 2019 ఎన్నికల్లో ఈ నియోజకవర్గానిదే సీఎం పదవని, అప్పుడు మీపై వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపిస్తానని అధికారులను హెచ్చరించారు.