శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 14 మార్చి 2017 (12:57 IST)

భూమా నాగిరెడ్డితో చంద్రబాబు చేయించిన తప్పులు చెప్పాల్సి వస్తుందనే వెళ్లలేదు : వైఎస్. జగన్

నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డితో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేయించిన తప్పులను చెప్పాల్సి వస్తుందనే తాము అసెంబ్లీకి వెళ్లలేదని వైకాపా అధినేత, విపక్ష నేత వైఎస్. జగన్ మోహన్ రెడ్డి వివరణ ఇచ్చారు.

నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డితో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేయించిన తప్పులను చెప్పాల్సి వస్తుందనే తాము అసెంబ్లీకి వెళ్లలేదని వైకాపా అధినేత, విపక్ష నేత వైఎస్. జగన్ మోహన్ రెడ్డి వివరణ ఇచ్చారు. మంగళవారం సమావేశమైన అసెంబ్లీ సమావేశాల్లో భూమా మృతికి సంతాపం తీర్మానం ప్రవేశపెట్టగా, వైకాపా సభ్యులు వాకౌట్ చేశారు. 
 
అనంతరం తమ వాకౌట్‌పై జగన్ వివరణ ఇచ్చారు. తమ పార్టీ మంగళవారం అసెంబ్లీకి హాజరై ఉంటే భూమా నాగిరెడ్డితో చంద్రబాబు చేయించిన తప్పుల గురించి మాట్లాడాల్సి వచ్చేదని, భూమా మరణించిన తర్వాత ఆయన తప్పులు చెప్పడం ఇష్టం లేకనే తాము సభను బహిష్కరించాల్సి వచ్చిందని చెప్పుకొచ్చారు. 
 
అదేసమయంలో భూమా మరణం తనను ఎంతో బాధించిందని, అది మాటల్లో చెప్పలేనిదన్నారు. ఆయన కుటుంబమంటే తనకెంతో గౌరవమని, దీనిపై బహిరంగంగా వ్యాఖ్యానించాల్సిన అవసరం లేదన్నారు. భూమాపై ఉన్న గౌరవంతోనే నేటి సభకు వెళ్లకూడదని నిర్ణయించుకున్నామని స్పష్టం చేశారు. 
 
భూమాకు నివాళులు అర్పిస్తున్న సమయంలోనూ, ప్రతి ఒక్కరూ వైకాపాను ప్రస్తావిస్తూనే ఉన్నారని, ఆయనపై ప్రేమ కన్నా, తమను ఆడిపోసుకోవాలన్న ఉద్దేశమే వారిలో ఎక్కువగా కనిపించిందని జగన్ ఎద్దేవా చేశారు. అంతేకాకుండా, అసెంబ్లీలో ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి సంతాప తీర్మానాన్ని కూడా రాజకీయం చేశారనీ మండిపడ్డారు. 
 
ఇంత దిగజారుడు రాజకీయాలు అవసరమా? అని ప్రశ్నించారు. తండ్రి మృతి చెందిన 24 గంటల్లోనే అఖిలప్రియను అసెంబ్లీకి తీసుకురావడం చంద్రబాబు కుసంస్కారానికి ఒక నిదర్శనమని విమర్శించారు. తండ్రి చనిపోయిన బాధలో ఉన్న అమ్మాయిని... రాజకీయాల కోసం అసెంబ్లీకి తీసుకొస్తారా? అంటూ ధ్వజమెత్తారు.