శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By PNR
Last Updated : బుధవారం, 30 జులై 2014 (11:17 IST)

ఆంధ్రప్రదేశ్ రాజధాని మోడల్ సిటీగా ఉండాలి : జగన్ ఆకాంక్ష!

అవశేష ఆంధ్రప్రదేశ్‌కు నిర్మించే కొత్త రాజధాని మోడల్ సిటీగా ఉండాలని వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఒక మోడల్ సిటీగా కొత్త రాజధానిని నిర్మించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వ భూములు ఎక్కడ ఎక్కువగా అందుబాటులో ఉంటే అక్కడే రాజధాని నిర్మించాలన్నది తమ పార్టీ అభిప్రాయమన్నారు. 
 
రాజధాని నిర్మాణానికి కనీసం 30 వేల ఎకరాల భూమి అవసరం ఉంటుందని, ప్రభుత్వ భూములైతే వనరుల సమీకరణకు కూడా ఇబ్బందులు లేకుండా సరికొత్త మోడల్ సిటీగా, భవిష్యత్తు అవసరాలను తీర్చేదిగా కొత్త రాజధానిని నిర్మించుకోవచ్చన్నారు. ఇదే అంశాన్ని తాను శాసనసభలోనూ చెప్పానని గుర్తుచేశారు. రాజధాని నిర్మాణానికి సంబంధించి తమ అభిప్రాయాలతో కూడిన ఒక వినతిపత్రాన్ని అందజేశారు. 
 
రాజధాని కోసం ప్రైవేటు భూములను సేకరించడం వల్ల వనరులతోపాటు అనేక సమస్యలు తలెత్తుతాయని, అందువల్ల ప్రభుత్వ భూములు ఉన్నచోటే కొత్త రాజధానిని నిర్మించుకోవాలన్నది తమ పార్టీ అభిప్రాయమని జగన్ ఫోరం ప్రతినిధులకు వివరించారు. రాజధాని ఎంపిక విషయంలో అన్ని రాజకీయ పార్టీలతో చర్చించి అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకుంటే మంచిదని చెప్పారు.