శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Raju
Last Updated :చెన్నై , శనివారం, 1 జులై 2017 (01:31 IST)

రోజు మనం ఒకరి ముఖాలు ఒకరు చూసుకోవాలి.. సామరస్యంతో కలిసిపోదామన్న వైఎస్ జగన్

వివాదాలను పరిష్కరించడంలో వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ కొత్త బాట పడుతున్నారా? గరగపర్రులో సాంఘిక బహిష్కరణకు గురైన దళితులను పరామర్శించిన సందర్భంగా ప్రతిపక్ష నేత ప్రదర్శించిన సంయమనం రాజకీయ పరిశీలకులను ఆ

వివాదాలను పరిష్కరించడంలో వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ కొత్త బాట పడుతున్నారా? గరగపర్రులో సాంఘిక బహిష్కరణకు గురైన దళితులను పరామర్శించిన సందర్భంగా ప్రతిపక్ష నేత ప్రదర్శించిన సంయమనం రాజకీయ పరిశీలకులను ఆశ్చర్యంలో ముంచెత్తింది. అంబేద్కర్ విగ్రహం పెట్టినందుకు గత మూడునెలలుగా అగ్రకులాల వారు తమను సాఘిక బహిష్కరణకు గురిచేశారని, నానా బాధలు పడుతున్నా ముఖ్యమంత్రి చంద్రబాబు ఏమాత్రం పట్టించుకోలేదని దళితులు ఆరోపిస్తున్నా స్పందించని, చంద్రబాబుపై ప్రతివిమర్శలు చేయని వైస్ జగన్.. ఊరు ఉంటే... అంతా ఉండాలి, ఇరుపక్షాలు ఊళ్లో ఉండాలి. రోజు మనం ఒకరి ముఖాలు ఒకరు చూసుకోవాలి. ఇష్టం ఉన్నా, లేకున్నా జీవితాలు ఇక్కడే గడపాలి. అన్ని మరిచిపోయి కలిసి ఉండాలన్నదే మా ఆశ. అందరు చెడ్డవాళ్లు కాదు. ఎవరైనా తప్పు చేస్తే ప్రభుత్వం విచారణ చేస్తుంది అంటూ జగన్ సామరస్యపూర్వకంగా మాట్లాడటం ఆ సమావేశానికి హాజరైన ప్రతి ఒక్కరినీ కదిలించింది. పైగా తెలుగు దేశం పార్టీ కార్యకర్తలు, చిన్న స్థాయి నేతలు కూడా జగన్ సంయమన ధోరణితో ఆలోచనలో పడటం విశేషం. 
 
ఊరంటే అందరూ ఉండాలి, అంతా కలిసి ఉండాలని  వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి  అన్నారు. ఆయన శుక్రవారం పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు మండలం గరగపర్రులో సాంఘిక బహిష్కరణకు గురైన దళితులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన  సంఘటనకు సంబంధించి వివరాలను అడిగి తెలుసుకున్నారు.
తమను అన్యాయంగా సాంఘిక బహిష్కరణ చేశారని, పనుల్లో నుంచి తొలగించారని దళితులు తమ ఆవేదన వ్యక్తం చేశారు. అంబేడ్కర్‌ విగ్రహాన్ని పెట్టడమే తమ పొరపాటా అని వారు ప్రశ్నించారు. 50 ఏళ్లుగా ఇతర కులాలతో బంధువుల్లా మెలిగామని, గత మూడు నెలలుగా వివాదం జరుగుతుంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏ మాత్రం పట్టించుకోలేదన్నారు. స్థానిక నేతలతో పాటు, అధికారులు కూడా తమను పట్టించుకోలేదన్నారు.
 
ఈ సందర్భంగా వైఎస్‌ జగన్‌ మాట్లాడుతూ.... ‘సమాచార లోపం వల్లే వివాదం పెరిగిందని దళితేతరులు చెబుతున్నారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం ప్రకారం పరిహారం ఇవ్వాలి. ఊరు ఉంటే... అంతా ఉండాలి, ఇరుపక్షాలు ఊళ్లో ఉండాలి. రోజు మనం ఒకరి ముఖాలు ఒకరు చూసుకోవాలి. ఇష్టం ఉన్నా, లేకున్నా జీవితాలు ఇక్కడే గడపాలి. చట్టప్రకారం ఏం జరగాలో అది జరగాలి. వివాదం పరిష్కారానికి నాలుగు అడుగులు ముందుకేయాలి. అన్ని మరిచిపోయి కలిసి ఉండాలన్నదే మా ఆశ. అందరు చెడ్డవాళ్లు కాదు. ఎవరైనా తప్పు చేస్తే ప్రభుత్వం విచారణ చేస్తుంది. విచారణ తర్వాత ఎమ్మార్వోను, సెక్రటరీనీ సస్పెండ్‌ చేశారు.
 
ఇలాంటి పరిణామాలు మళ్లీ రాకూడదని వాళ్లు కూడా (దళితేతరులు) ఆశిస్తున్నారు. తప్పు చేసిన వారికే శిక్షలు పరిమితం కావాలని మీరు (దళితులు) అంటున్నారు. ఊరికి మంచి జరగాలని నేను కోరుకుంటున్నాను. పార్టీ తరఫున కమిటీని ఏర్పాటు చేస్తున్నా. రెండు వర్గాలు కలిసిమెలిసి ఉండటానికి కమిటీ కృషి చేస్తుంది. గతాన్ని మరిచిపోయి అంతా ముందుకు వెళ్లాలి.’ అని సూచించారు. తమకు హామీ ఇస్తే అందుకు సిద్ధమేనని దళితులు తెలిపారు. అన్ని విగ్రహాలు తీసేస్తే...అంబేద్కర్‌ విగ్రహాన్ని కూడా తీసేయలని వారు కోరారు.  కాగా అంతకు ముందు వైఎస్‌ జగన్‌ దళితేతరులను కలిసి ఈ ఘటనపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.
 
అవకాశం ఏమాత్రం దొరికినా చంద్రబాబుపై ఆయన ప్రభుత్వంపై ఒంటికాలితో లేచే  జగన్ దళితులు చంద్రబాబుపై ఆరోపిస్తున్నా.. ఇంత సంయమనం ప్రదర్శించడం చూస్తుంటే జగన్ కొత్తగా నియమించిన ఎన్నికల ప్రచాకకర్త ప్రశాంత్ కుమార్ బోధనలు జగన్‌పై పనిచేస్తున్నాయా అనిపిస్తోంది. చీటికీ మాటికీ ప్రభుత్వంపై పూర్తి వ్యతిరేక ధోరణితో వెళ్లడం ప్రజల్లో సానుకూలత లేకుండా చేస్తుందని రోజాని కూడా మాట దురుసుతనంపై కాస్త దూకుడు తగ్గించుకునేలా సూచించాలని ప్రశాంత్ కుమార్ గతంలోనే జగన్‌కి సలహా ఇచ్చిన విషయం తెలిసిందే. చంద్రబాబుపై ఛాన్సు దొరికితే చండ్రనిప్పులు కురిపించే జగన్‌లో ఈ కొత్త ధోరణి టీడీపీవారితో సహా అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది.