గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : శుక్రవారం, 7 జూన్ 2019 (13:09 IST)

కొత్త మంత్రులకు విజయసాయి నుంచి కబురు వస్తుంది.. సిద్ధంగా ఉండండి.... జగన్

వైకాపా శాసనసభా పక్ష సమావేశం శుక్రవారం జరిగింది. ఇందులో ఐదుగురు డిప్యూటీ ముఖ్యమంత్రులు ఉంటారని జగన్ వెల్లడించారు. అలాగే, కొత్త మంత్రులను కూడా ఆయన ఎంపిక చేశారు. అయితే, కొత్త మంత్రులకు ఎంపీ విజయసాయి రెడ్డి శుక్రవారం సాయంత్రం ఫోన్ చేస్తారనీ, ఫోను వచ్చిన వారంతా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసేందుకు సిద్ధంగా ఉండాలని జగన్ కోరారు. 
 
గత ప్రభుత్వంలో అవినీతి ఏరులై పారిందన్నారు. చంద్రబాబు ఓటమికి ఆయన మంత్రివర్గంలోని మంత్రుల అవినీతే ప్రధాన కారణమన్నారు. టీడీపీ హయాంలో మంత్రులు ఇష్టానుసారంగా దోచుకోవడం వల్లే ఇలా జరిగిందన్నారు. కానీ, మన ప్రభుత్వంలో అవినీతికి తావులేని విధంగా మంత్రులు ప్రమాణ స్వీకారం చేసిన మరుసటి రోజు నుంచి పారదర్శకత పాటిస్తామని ఆయన వెల్లడించారు. 
 
వైకాపా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, "రాష్ట్రం మొత్తం మనవైపు చూస్తోంది. మనం వేసే ప్రతి అడుగు ప్రజలకు దగ్గర చేయాలి. సంక్షేమం కోసం పాలనలో చాలా మార్పులు తీసుకురావాలి. అవినీతికి ఏమాత్రం తావివ్వకుండా పాలన జరగాలి. హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ను కలిసి జ్యుడీషియల్‌ కమిషన్‌ గురించి అడిగా. ఇక నుంచి ప్రతి టెండర్ల ప్రక్రియ పూర్తి పారదర్శకంగా జరగాలి.  ప్రతి కాంట్రాక్ట్‌ ప్రక్రియ మొదటి నుంచి జడ్జి వద్దకు వెళుతుంది. ఏడు రోజుల పాటు పబ్లిక్‌ డొమైన్‌లో టెండర్ల ప్రక్రియ ఉంటుంది. జ్యుడీషియల్‌ కమిషన్‌ సూచనల మేరకు ప్రతి టెండర్‌లో మార్పులు ఉంటాయన్నారు. 
 
ఆరోపణలు వచ్చిన వాటిపై రివర్స్‌ టెండర్‌ ప్రక్రియ చేడతాం. రివర్స్‌ టెండరింగ్‌లో ఎంత మిగిలిందో ప్రజలకు వివరిస్తాం. చంద్రబాబు పాలనలో అంచనాలకు మించి టీడీపీ నేతలు దోచుకున్నారు. ప్రమాణ స్వీకారం నాటి నుంచి పారదర్శక పాలన గురించే ఆలోచనలు. ఇప్పటివరకూ తీసుకున్న అన్ని నిర్ణయాలు ఆ దిశగానే చేస్తున్నాం. అర్హత ఉన్న చివరి వ్యక్తి వరకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందిస్తాం. మనం వేసే ప్రతి అడుగు ద్వారా మన గ్రాఫ్‌ పెరగాలి. నామినేషన్‌ పద్దతిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 50 శాతం పనులు కేటాయిస్తాం" అని చెప్పారు.