బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By PNR
Last Updated : మంగళవారం, 1 సెప్టెంబరు 2015 (12:34 IST)

ప్రత్యేక హోదాపై చంద్రబాబుకు అవగాహన లేదు : వైఎస్ జగన్ మోహన్ రెడ్డి

ప్రత్యేక హోదాపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఏమాత్రం అవగాహన లేదని విపక్ష నేత, వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. వర్షాకాల సమావేశాల్లో భాగంగా మంగళవారం ప్రత్యేక హోదాపై చంద్రబాబు ప్రకటన చేశారు. దీనిపై జరిగిన చర్చలో జగన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏపీకి ప్రత్యేక హోదా కోసం ఏం చేశారు.. చేయబోతున్నారన్న విషయాన్ని మినహా ఏ ఒక్క విషయాన్ని కూడా చంద్రబాబు స్పష్టంగా చెప్పలేదన్నారు. 
 
పైగా తప్పుడు సమాచారంతో అసెంబ్లీ మొత్తాన్నీ తప్పుదారి పట్టిస్తున్నారని జగన్ ఎద్దేవా చేశారు. చంద్రబాబు సుదీర్ఘ ప్రసంగంలో గణాంకాలు తప్ప, హోదా గురించి ఒక్క మాట కూడా చెప్పలేదని దుయ్యబట్టారు. ప్రత్యేక హోదాపై సీఎంకు అణుమాత్రమైనా అవగాహన ఉన్నట్టు కనిపించడం లేదని విమర్శించారు. ఏపీకి తక్షణం హోదా కల్పించేందుకు ఎటువంటి చర్యలు తీసుకుంటారో చెప్పకుండా, ఏదో బ్రహ్మ పదార్థాన్ని తీసుకువస్తున్నట్టు మాట్లాడుతున్నారని, ఇది రాష్ట్ర ప్రజలందరి ఖర్మని అన్నారు. 
 
ఏదైనా రాదని తెలిస్తే, అది వృథాగా ప్రచారం చేయడం బాబుకు అలవాటేనని విమర్శించారు. ప్రత్యేక హోదాను మించిన ప్యాకేజీ తెస్తామని అనడం సరికాదని, హోదానే ఇవ్వనివారు, అంతకు మించిన ప్యాకేజీని ఎలా ఇస్తారని జగన్ నిలదీశారు. కేంద్ర మంత్రులు చెప్పే మాటలను ఈ ముఖ్యమంత్రి ఎలా నమ్ముతారని జగన్ అడిగారు. రాష్ట్రం విడిపోవడానికి కారణం ఎవరో అందరికీ తెలుసునని అన్నారు. చంద్రబాబుకు తెలియని ఎన్నో విషయాలపై తమకు అవగాహన ఉందని జగన్ అన్నారు.