బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : సోమవారం, 1 సెప్టెంబరు 2014 (12:25 IST)

బాపుకు అసెంబ్లీ సంతాపం: కొత్త రాష్ట్రంలో కళాక్షేత్రం

బాపు మృతికి అసెంబ్లీ సంతాపం తెలిపింది. సోమవారం అసెంబ్లీలో బాలకృష్ణ శ్రీరామరాజ్యాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రస్తావించారు. బాపు - రమణల పేరిట ప్రపంచస్థాయి కళాక్షేత్రాన్ని ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధానిలో ఏర్పాటు చేస్తామని చంద్రబాబు చెప్పారు. కార్టూనిస్టుగా, దర్శకుడిగా బాపు అంచెలంచెలుగా ఎదిగారన్నారు. 
 
ముత్యాల ముగ్గు చిత్రం ఓ కళాఖండమన్నారు. అక్కినేనికి ఎన్నో అవార్డులు తెచ్చి పెట్టింది బాపు చిత్రాలే అన్నారు. బాపుకు రాని అవార్డు లేదన్నారు. పద్మశ్రీ, రఘుపతివెంకయ్య అవార్డులు వచ్చాయన్నారు. తిరుపతి అకాడమీ ఆఫ్ ఫైనార్ట్స్ కూడా అవార్డును ఇచ్చిందన్నారు.
 
చిత్రకారుడిగా ఖండాంతరాలకు తెలుగు ఖ్యాతిని ఇనుమడింప చేశారన్నారు. కృష్ణుడు, రాముడి వంటి పురాణ పురుషుల పాత్రలను బాపు తీర్చిదిద్దారన్నారు. సీతమ్మను సుగుణాల రాశి, తెలుగింటి తల్లిగా చేసింది బాపూనేనని కొనియాడారు. 
 
బాపు మృతి తీరని లోటు అన్నారు. బాపు - రమణల పేరిట ఏపీలో మ్యూజియం ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఎన్టీఆర్ హయాంలో బాపు - రమణల సహకారంతో పాఠ్యపుస్తకాలు వచ్చాయన్నారు. విజయవాడలోని కోస్టల్ మ్యూజియానికి బాపు పేరు పెడతామన్నారు.
 
మరోవైపు మరణం లేని మహా మనిషి బాపు అని జగన్ అన్నారు. తెలుగు వారు ఎప్పుడు గుర్తుంచుకనే వ్యక్తి అన్నారు. తెలుగు జాతి ఓ ఆణిముత్యాన్ని కోల్పోయిందన్నారు. బాపు మరణం బాధాకరమన్నారు. బాపు గారి గీత, రాత తెలుగువారి జీవితాల్లో భాగమన్నారు.