గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By PNR
Last Updated : మంగళవారం, 7 జులై 2015 (14:59 IST)

నన్ను తాకొద్దు అంటే అట్రాసిటీ కేసు పెడతారా : జగన్ ప్రశ్న

తమ పార్టీ ఎమ్మెల్యే భూమానాగిరెడ్డిపై కర్నూలు జిల్లా పోలీసులు ఎస్సీఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టడాన్ని వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డి తీవ్రంగా తప్పుబట్టారు. నన్ను తాకొద్దు అంటే ఎస్సీఎస్టీ అట్రాసిటీ కేసు పెడతారా అంటూ ప్రశ్నించారు. 
 
కర్నూలు జిల్లాలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా జరిగిన చిన్నపాటి వాగ్వాదం తర్వాత భూమానాగిరెడ్డిపై కర్నూలు జిల్లా పోలీసులు అట్రాసిటీ కేసును నమోదు చేసి, ఆయనను అరెస్టు చేశారు. ఆయనకు ఛాతి నొప్పి రావడంతో ప్రస్తుతం కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రిలోనే చికిత్స చేస్తున్నారు. 
 
ఆయనను జగన్ మంగళవారం పరామర్శించారు. అనంతరం జగన్ మీడియాతో మాట్లాడుతూ ఏపీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ కోట్లు కుమ్మరించిందని ఆరోపించారు. లంచాల సొమ్ముతో ఓట్లను కొనుగోలు చేశారని విమర్శించారు. ఈ దారుణాలకు పాల్పడిన ముఖ్యమంత్రి చంద్రబాబు సిగ్గుతో తల దించుకోవాలన్నారు. 
 
ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియపై పోలీసులు దురుసుగా ప్రవర్తించారని, కుట్రతో భూమా నాగిరెడ్డిపై కేసు పెట్టారని మండిపడ్డారు. కన్న కూతురుని దుర్భాషలాడితే ఏ తండ్రీ తట్టుకోలేడని... భూమా నాగిరెడ్డి కూడా అదే చేశారన్నారు. దీంతో పోలీసులు భూమను నెట్టేశారని... తనను నెట్టవద్దని చెప్పే క్రమంలో 'డోంట్ టచ్ మీ' అని అంటే ఏకంగా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసును బనాయించారని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు.