శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By PNR
Last Updated : బుధవారం, 22 అక్టోబరు 2014 (10:43 IST)

రామోజీ రావు - పరకాలకు వైకాపా ఎమ్మెల్యే లీగల్ నోటీసు!

ఈనాడు గ్రూపు సంస్థల అధిపతి రామోజీ రావుకు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మీడియా సలహాదారు పరకాల ప్రభాకర్‌కు చంద్రగిరి వైకాపా ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి మంగళవారం లీగల్ నోటీసులు పంపారు. తన పరువుకు భంగం కలిగించేలా ప్రభాకర్ మాట్లాడితే కనీసం తన వివరణ తీసుకోకుండానే, దురుద్దేశంతో ఆ వ్యాఖ్యలను ఈనాడు పత్రికలో ప్రచురించారంటూ ఆ పత్రిక అధిపతి రామోజీ రావుకు ఆయన నోటీసులు పంపించారు. ఈ నోటీసు అందిన 15 రోజుల్లోపు నష్ట పరిహారంగా రూ.20 లక్షలు చెల్లించాలని డిమాండ్ చేశారు. 
 
అయితే, చెవిరెడ్డి వారిద్దరికి లీగల్ నోటీసులు పంపించడానికి కారణం లేకపోలేదు. చెవిరెడ్డి తండ్రికి పింఛను వస్తోందని... ఆర్థికంగా స్థితిమంతుడైన ఆయనకు పింఛన్ ఇవ్వాలా? అంటూ కొద్ది రోజుల క్రితం పరకాల వ్యాఖ్యానించారు. అంతేకాకుండా, దీనిపై వైకాపా అధినేత జగన్ సమాధానం ఇవ్వాలని కూడా డిమాండ్ చేశారు. ఈ వార్తలు 'ఈనాడు'తో పాటు పలు పత్రికల్లో ప్రచురితం అయ్యాయి. ఈ నేపథ్యంలోనే, రామోజీ, పరకాలకు చెవిరెడ్డి నోటీసులు పంపారు.