శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 12 ఫిబ్రవరి 2016 (17:36 IST)

టీడీపీలో ఏముందని అక్కడకు వెళ్తారు : వైకాపా ఎమ్మెల్యే రోజా ప్రశ్న

తెలుగుదేశం పార్టీలో ఏముందని అక్కడకు మా పార్టీ ఎమ్మెల్యేలు వెళతారని వైకాపా ఎమ్మెల్యే రోజా ప్రశ్నించారు. టీడీపీ కావాలనే తప్పుడు ప్రచారం చేస్తోందని ఆరోపించారు. ఇదే అంశంపై ఆమె మాట్లాడుతూ పరిపాలనలో టీడీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైదన్నారు. తెలంగాణలో టీడీపీకి మిగిలింది ఇద్దరు ఎమ్మెల్యేలేనన్నారు. రాష్ట్రంలో అన్నివర్గాలవారిని చంద్రబాబు మోసం చేశారని మండిపడ్డారు. ఎప్పటికైనా టీడీపీ మునిగిపోయే పడవ అని వైసీపీ ఎమ్మెల్యే రోజా అన్నారు. 
 
ఇకపోతే తన సస్పెన్షన్‌పై ఆమె హైకోర్టును ఆశ్రయించారు. తన సస్పెన్షన్‌ను రద్దు చేయాలని, తాను అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యేలా ఉత్తర్వులివ్వాలని కోర్టును కోరారు. ఈ మేరకు తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. గతేడాది అసెంబ్లీలో కాల్‌మనీ సెక్స్‌రాకెట్ అంశంపై జరిగిన వాగ్వాదం సందర్భంగా రోజా అసభ్యకర రీతిలో వ్యాఖ్యలు చేశారని, సభాపతి స్థానాన్నే అవమానించేలా మాట్లాడారని, తద్వారా సభా నియమాలను ఉల్లంఘించారన్న ఆరోపణలు వచ్చాయి. ఈ మొత్తం వ్యవహారంపై ప్రభుత్వం ప్రతిపాదించిన తీర్మానాన్ని స్పీకర్ కోడెల శివప్రసాద్ ఆమోదించారు. దీంతో రోజా పైన ఏడాది పాటు సస్పెన్షన్ విధించిన విషయం తెల్సిందే. 
 
రోజా పైన ఏడాది పాటు సస్పెన్షన్ వేటు వేయడాన్ని వైసిపి ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో రోజా తాజాగా సభాపతి నిర్ణయాన్ని హైకోర్టులో సవాల్ చేశారు. తనపై విధించిన సస్పెన్షన్ బిజినెస్ రూల్స్‌కు విరుద్ధమని ఆమె చెప్పారు. సస్పెన్షన్ ఉత్తర్వులను సైతం తనకివ్వలేదని వాపోయారు. స్పీకర్ తన హక్కులను కాలరాశారన్నారు. ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని కోర్టును అభ్యర్థించారు. నిబంధనల ప్రకారం సస్పెన్షన్ ఒక సెషన్‌కు మాత్రమే పరిమితం చేయాల్సి ఉన్నా స్పీకర్ దానిని ఉల్లంఘించి ఏడాది పాటు సస్పెండ్ చేశారని ఆమె తన పిటిషన్‌లో ఆమె పేర్కొన్నారు.