శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By PNR
Last Updated : శనివారం, 20 డిశెంబరు 2014 (17:11 IST)

హదూద్ తుఫానుతో పచ్చచొక్కా నేతల జేబులు నిండాయ్ : ఎమ్మెల్యే రోజా

విశాఖపట్టణాన్ని అతలాకుతలం చేసిన హుదూద్ తుఫాను వల్ల పచ్చాచొక్కాలు ధరించిన నేతల జేబులు బాగా నిండాయని వైకాపా ఎమ్మెల్యే, సినీ నటి రోజా ఆరోపించారు. ఆమె శనివారం మాట్లాడుతూ హుదూద్ తుఫాను వల్ల టీడీపీ నేతలు బాగా లాభపడ్డారని ఆరోపించారు. హుదూద్ బాధితులకు 25 కేజీల బియ్యం సరఫరా చేశాం అంటూ టీడీపీ నేతలు చంకలు గుద్దుకుంటున్నారని ఆమె ఎద్దేవా చేశారు. రేషన్ షాపులో కిలో రూపాయికే అందజేస్తున్నారని, అలాంటప్పుడు 25 కేజీల బియ్యం ధర ఎంత?ని రూ.25 కదా అని గుర్తు చేశారు. 
 
ఇకపోతే.. సాక్షాత్ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బస్సులో వారం రోజులు ఉన్నారని టీడీపీ నేతలు గుండెలు బాదుకుంటున్నారని, ఆయన ఉన్న బస్సు ఫైవ్ స్టార్ హోటల్‌లోని గదుల కంటే అద్భుతమైన సౌకర్యాలు ఉన్నాయని, ఇలాంటి బస్సుల్లో వారం రోజులే కాదు.. నెల రోజులైనా ఉండొచ్చన్నారు. వారం రోజులు బస్సులో ఉన్నప్పటికీ ఆయన ఏం చేశారని నిలదీశారు. 
 
హుదూద్ తుఫాను చూసిన వేలాది మంది దాతలు చేసిన దానాలు ఏమయ్యాయని ఆమె నిలదీశారు. ఆ డబ్బు ఎక్కడికి చేరిందని ఆమె అడిగారు. విశాఖలో తుఫాను ధాటికి కూలిన చెట్లను తొలగించడం తప్ప రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందని ఆమె ప్రశ్నించారు. విద్యుత్ పరికరాలు తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలు ఇచ్చాయి. రేడియో సెట్లు ఒరిస్సా ఇచ్చిందన్నారు. 
 
కార్మికులను తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలు సమకూర్చాయి. అలాంటప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏంచేసిందని ఆమె అడిగారు. బెంగాల్ నుంచి మమతా బెనర్జీ బంగాళాదుంపలు పంపిస్తే టీడీపీ నేతల ఇళ్లలో నిల్వ చేసుకున్నారని ఆమె విమర్శించారు. టీడీపీ నేతలు ప్రతిపక్షంపై విమర్శలు చేయడం కాదని, ఆత్మ విమర్శ చేసుకోవాలని ఆమె సూచించారు.