గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. ఆయుర్వేదం
Written By Selvi
Last Updated : సోమవారం, 21 జులై 2014 (18:07 IST)

కరివేపాకును తీసిపారేయకండి.. పోషక విలువలేంటో తెలుసుకోండి!

కరివేపాకును ఎరుగని వారంటూ ఉండరు. దీనిని సురభినింభయని కూడా పిలుస్తారు. కరివేపాకు చెట్టును ప్రతి ఒక్కరూ గృహంలో పెంచుకొని, దాని ఆకులను ఆహారంగా, ఔషధంగా నిత్య జీవితములో ఉపయోగించుకోవచ్చు. ఆహారానికి రుచిని, సువాసనను కలిగించడమే కాకుండా ఆ ఆహారమును తీసుకునే వారిలో జీర్ణశక్తిని పెంచుతుంది. 
 
కరివేపాకును కూరలలో, చారులో ఉపయోగించడం అందరికీ తెలిసినా, దానిలో వుండే పోషక విలువలు చాలా మందికి తెలియవు. కరివేపాకులలో 6.1% మాంసకృతులు, 7 మిల్లీ గ్రాముల ఇనుము, 1% క్రొవ్వుపదార్థం, 18.7% పీచు పదార్ధాలు. 8.30 మి. గ్రా. కాల్షియం , 12% ఇంటర్నేషనల్‌ యూనిట్ల విటమిన్‌ ఎ ఉంటాయి.
 
కరివేపాకులో మనకు జీర్ణరసాన్ని వృద్ధిచేసే ఎంజైమ్‌లు లభిస్తాయి. తిన్న ఆహారం తేలికగా పచనం అయ్యేందుకు ఈ కరివేపాకును మనం కూరల్లో, దైనందిన వంట దినుసుల్లో ఉపయోగిస్తుంటాము. 
 
కరివేపాకు ఉపయోగాలు
కడుపులో గ్యాసుకు :
నీడలో ఎండించిన రివేపాకు, శొంఠి,మిరియాలు సమభాగములో తీసుకొని చూర్ణంచేసి 6 గ్రా. మోతాదుగా ఆహారంలో సేవించిన ఉపశమనం కలుగుతుంది.  
 
పచ్చకామెర్ల వ్యాధి : 
కరివేపాకును కడిగి రసమును తీసి, సమానము తేనెతో కలిపి ప్రతి రోజూ ఉదయం, సాయంత్రం త్రాగించాలి. 
 
శరీర బరువు : 
కరివేపాకు రసం మరియు ఉసిరికాయ రసం సమానంగా తీసుకొని రోజు 1/2 కప్పు సేవించాలి. ఈ ప్రయోగం శరీరం బరువు తగ్గడానికి కూడా పనికివస్తుంది.
 
జుట్టు నిగనిగలాడటానికి : 
కరివేపాకు, గోరింటాకులను ముద్దగా నూరి నువ్వుల నూనెలో వేసి కాచి వడగట్టుకొని ప్రతిరోజు తల వెంట్రుకలకు రాసుకోవాలి. పై మాదిరిగానే కరివేపాకు, మందారాకులరసం, కొబ్బరిపాలు ప్రతినిత్యం జుట్టుకు పట్టించి, ఫలితాన్ని పొందవచ్చును.
 
రే చీకటి కలవారికి :
కరివేపాకు రసం కానీ, ఎండబెట్టిన పొడిని గానీ నిత్యం ఒక చెంచా చొప్పున తినిపిస్తూ, కరివేపాకు చట్నీని ఆహారములో యివ్వాలి. ఇలాంటి అనేక అద్భుత ఔషధ ప్రయోగాలను ఇంటివద్దనే చేసుకొని, ఆరోగ్య రక్షణలో శ్రమను, కాలాన్ని వృధావ్యయాన్ని తగ్గించుకోవచ్చును.