శుక్రవారం, 29 మార్చి 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. ఆహారం
Written By PNR
Last Updated : గురువారం, 14 ఆగస్టు 2014 (19:48 IST)

శరీర వ్యాయామం పేరుతో ఎంతైనా ఆరగించవచ్చా?

వ్యాయామం చేయడం ప్రతి మహిళకూ తప్పనిసరి అవసరమే. కానీ, వ్యాయామం చేస్తున్నామని చెప్పి ఏదిపడితే అది లాగించేద్దాం అంటే మాత్రం ప్రమాదమేనంటున్నారు ఆహార వైద్య నిపుణులు. గంటల తరబడి వ్యాయామం చేస్తున్నా కాబట్టి కొవ్వు మొత్తం కరిగిపోవడం ఖాయమని భావించడం పొరపాటేనని వారు చెపుతున్నారు. 
 
ఎందుకంటే మనం రోజులో వినియోగించే శక్తి కంటే ఎక్కువ కేలరీలను తీసుకుంటూ వస్తే ఎంత వ్యాయామం చేసినా ఫలితముండదు. పైగా మిగిలిన కేలరీలు కొవ్వులా మారడం తథ్యం. ఎందుకంటే జీవన పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో మనం తీసుకుంటున్న ఆహారంలో పోషకాహారం పాలుకు మించి, ఖర్చు కాని పదార్థాలే ఆహారంలో ఎక్కువగా ఉంటున్నాయి.
 
అందుకే... వ్యాయామం చేస్తున్నాం కాబట్టి ఎక్కువ తిన్నా నష్టం లేదులే అనుకోవటం సరికాదు. మితంగా తినడం, సాధ్యమైనంత కఠిన శ్రమ చెయ్యడం ఇదే మంచి సూత్రం. మరీ ముఖ్యంగా మహిళలు తీరిక వేళల్లో కారప్పూస, స్వీట్, గింజలు ఇలా ఏదో ఒకటి తినడం అలవాటుగా ఉంటోంది. 
 
భోజనం చేసిన తర్వాత ఇలాంటి చిరుతిళ్ళకు అలవాటు పడ్డారంటే మహిళలు ఎంతగా వ్యాయామం చేసినా వారిలో నిల్వ ఉన్న కొవ్వు పదార్థాలు కరిగే ప్రసక్తే లేదని గుర్తుంచుకుంటే చాలా మంచిది. అందుకని తీసుకున్న ఆహారం మేరకు మించి శారీరక శ్రమ చేస్తున్నామా లేదా అనేది ఎవరికి వారు పరీక్షించుకోవాలి.