గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Modified: సోమవారం, 9 డిశెంబరు 2019 (15:56 IST)

దిల్లీ అగ్నిప్రమాదం: ‘ముగ్గుర్ని కాపాడా.. కానీ, నా సోదరుడిని కాపాడుకోలేకపోయా’

''నా సోదరుడు మధ్యలోనే ఇలా దూరమవుతాడని నేనెప్పుడూ అనుకోలేదు. ఏ విషయమైనా నన్ను సంప్రదించేవాడు. 'ఇది చేయాలా? అది చేయాలా' అంటూ అడిగేవాడు. మంటలు చెలరేగినప్పుడూ నాకు ఫోన్ చేశాడు. తనను కాపాడమని అడిగాడు. కానీ, నేను ఆ పని చేయలేకపోయా'' అంటూ దిల్లీలోని ఎల్‌ఎన్‌జీపీ ఆసుపత్రిలో బబ్లూ అనే వ్యక్తి ఫోన్‌లో తన బాధను ఎవరికో వివరిస్తున్నారు.

 
దిల్లీలోని రాణీ ఝాన్సీ రోడ్డులోని అనాజ్ మండీలో ఉన్న ఓ పరిశ్రమలో ఆదివారం ఉదయం జరిగిన అగ్నిప్రమాదంలో ప్రాణాలు పోగోట్టుకున్న 43 మందిలో బబ్లూ సోదరుడు మహమ్మద్ హైదర్ కూడా ఉన్నారు. ప్రమాదం జరిగిన స్థలానికి తాను సమయానికి చేరుకున్నా, తన సోదరుడిని కాపాడుకోలేకపోయానని బబ్లూ వాపోతున్నారు.

 
''నేను సమయానికే అక్కడికి వెళ్లా. 'మీ సోదరుడిని బయటకు తీసుకువచ్చారు' అని ఒకాయన నాతో చెప్పారు. కొంత ఉపశమనం పొందా. ఓ ముగ్గురు, నలుగురిని కాపాడా. కానీ, నా సోదరుడు లోపలే చిక్కుపోయి ఉన్నాడు. అతడి దగ్గరికి నేను వెళ్లలేకపోయా. నేను వెళ్లి చూసేసరికి, అతడు శవమై కనిపించాడు'' అని ఆయన అన్నారు.

 
''బబ్లూ చనిపోయాడు. రాజు చనిపోయాడు. తాఖిర్ చనిపోయాడు'' అంటూ పక్కనే మరో వ్యక్తి ఫోన్‌లో గట్టిగా ఎవరికో చెబుతున్నారు. అనాజ్ మండీ ప్రమాదంలో గాయపడ్డ వారిని పరామర్శించేందుకు వారి సన్నిహితులు ఎల్‌ఎన్‌జీపీ ఆసుపత్రికి పెద్ద సంఖ్యలో వచ్చారు. ఎక్కడో దూరంగా ఉన్న తమ కుటుంబ సభ్యులకు, బంధువులకు వారు ఫోన్ల ద్వారా సమాచారం చేరవేస్తున్నారు.

 
‘పిల్లాడి మొహం కూడా చూడకుండానే..’
ప్రమాదంలో క్షతగాత్రులైనవారిలో కొందరు రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రిలోనూ చికిత్స పొందుతున్నారు. ప్రమాదం జరిగిన పరిశ్రమలో 28 ఏళ్ల మహమ్మద్ అఫ్సద్ కుట్టుపని చేసేవారు. ఆయన దగ్గర పని నేర్చుకునేందుకు ఆయనకి తమ్ముడి వరుసయ్యే ఓ వ్యక్తి దిల్లీకి వచ్చారు. కానీ, ఇప్పుడు ఆ పని నేర్పించేందుకు అఫ్సద్ ప్రాణాలతో మిగల్లేదు.

 
''అఫ్సద్‌కు తల్లిదండ్రులు, సోదరి, భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆ కుటుంబం నడిచేందుకు ఆయనే ఆధారం. అఫ్సద్ సోమవారం తన ఇంటికి వెళ్లాల్సి ఉంది. అందుకు టికెట్లు కూడా బుక్ చేసుకున్నారు. అఫ్సద్ ఆధార్ కార్డు, రేషన్ కార్డులను అధికారులు తీసుకురమ్మంటున్నారు. అవి ఇక్కడ లేవు. వాటికోసం నేను వాళ్ల ఇంటికివెళ్లాలి'' అని అఫ్సద్‌కు తమ్ముడి వరుసయ్యే ఆ వ్యక్తి చెప్పారు.

 
మహమ్మద్ సద్దామ్‌ అనే వ్యక్తి కూడా ఎల్‌ఎన్‌జీపీ ఆసుపత్రికి వచ్చారు. ఆయన బావమరిది ఈ ప్రమాదంలో మృతిచెందారు. ''పరిశ్రమకు చేరుకున్నాక, అతడి మృతదేహం చూశా. ఈ మధ్యే అతడికి పిల్లాడు పుట్టాడు. వాడి మొహం ఎలా ఉంటుందో కూడా అతడు ఇంకా చూడలేదు. సోమవారం ఇంటికి వెళ్దాం అనుకున్నాడు. ఆ కుటుంబంలో డబ్బు సంపాదించేది అతడు ఒక్కడే. అతడి ఆధార్ కార్డు ప్రమాదంలోనే కాలిపోయింది. రేషన్ కార్డు కోసం నేను ఇప్పుడు అతడి ఇంటికి వెళ్లాలి'' అని అన్నారు.

 
ఒకే కుటుంబంలో ఇద్దరు..
బిహార్‌లోని నరియార్‌కు చెందిన ఓ కుటుంబంలోని ఇద్దరు వ్యక్తులూ అనాజ్ మండీ ప్రమాదంలో మరణించారు. ఆ ఇద్దరూ సొంత అన్నదమ్ములు. ''ఆ పరిశ్రమలో కుట్టుపని చేస్తూ, ఇద్దరూ కలిసి నెలకు రూ.25 వేల దాకా సంపాదించేవారు. వాళ్లకు తల్లిదండ్రులు, నలుగురు అక్కాచెల్లెళ్లు ఉన్నారు. అయితే, వారెవరూ సంపాదించే పరిస్థితిలో లేరు. మృత దేహాలను బిహార్‌కు తీసుకువెళ్లే ఆర్థిక స్థోమత మాకు లేదు. ఎవరైనా సాయం చేస్తే గానీ, ఆ పని చేయలేం'' అని ఆ ఇద్దరు అన్నదమ్ముల బంధువులు మోమినా, రుక్సానా అన్నారు.

 
32 ఏళ్ల మహమ్మద్ ముషారఫ్ కూడా ఆ పరిశ్రమలో పనిచేసేవారు. ఆయనకు ముగ్గురు కుమార్తెలు, ఓ కుమారుడు. ప్రమాదంలో ముషారఫ్ కూడా ప్రాణాలు కోల్పోయారు. ''ముషారఫ్ నాకు ఫోన్ చేశాడు. పరిశ్రమలో మంటలు అంటుకున్నాయని, తన కుటుంబం బాగోగులు చూసుకోమని అన్నాడు. ఏదైనా పక్క భవనంపైకి దూకమని సూచించా. అందుకు, అసలు మార్గమేదీ లేదని అతడు చెప్పాడు. కనీసం బయటపడేందుకు ఏదో ఒక మార్గమో, తలుపో ఉంటే వాళ్లు బతికేవాళ్లు'' అని ముషారఫ్ స్నేహితుడు శోభిత్ అన్నారు.

 
2007 నుంచి ముషారఫ్ దిల్లీలో పనిచేస్తున్నాడని, అయితే, ఆ పరిశ్రమలో ఎంతకాలం క్రితం చేరాడన్న విషయం మాత్రం తనకు తెలియదని ఆయన బంధువు ఖలీద్ హుస్సేన్ చెప్పారు. ''అతడిది చాలా పేద కుటుంబం. అతడు తప్పితే, వారి ఇంట్లో సంపాదించేవారు ఎవరూ లేరు. అతడి పిల్లలందరూ ఏడాది నుంచి నాలుగేళ్ల వయసు మధ్యలో ఉన్నవారే'' అని ఆయన అన్నారు.