శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Modified: సోమవారం, 5 ఏప్రియల్ 2021 (13:54 IST)

ఐపీఎల్ 2021: కొత్త నిబంధనలు, పాత ఆటగాళ్లతో ఐపీఎల్-14 ఎలా ఉండబోతోంది?

ఐపీఎల్ సీజన్ 14 ఈ ఏడాది ఏప్రిల్ 9 నుంచీ ప్రారంభం కానుంది. కరోనా మహమ్మారి కారణంగా ఈసారి ప్రేక్షకులు లేకుండానే మ్యాచులు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సీజన్‌లో కొన్ని కొత్త విషయాలు చోటు చేసుకోనున్నాయి. అవేమిటో చూద్దాం.
 
1. చెతేశ్వర్ పుజారా మళ్లీ వస్తున్నాడు
భారత టెస్టు జట్టులో ముఖ్యమైన ఆటగాడు చెతేశ్వర్ పుజారా ఒక రకంగా ఐపీఎల్‌లో అనాదరణకు గురయ్యాడని చెప్పొచ్చు. స్థిరంగా ఆడుతూ క్రీజులో పాతుకుపోతాడన్న పేరు పొందిన పుజారా ఫోర్లు-సిక్సులు మాత్రమే కొట్టే ఫార్మాట్‌లో తన సత్తా చాటుకోలేకపోయాడు. అయితే, ఏడేళ్ల తరువాత మళ్లీ పుజారా ఐపీఎల్‌లోకి వస్తున్నాడు. పుజారా గతంలో కోల్‌కతా నైట్ రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టులో ఆడాడు. 30 మ్యాచుల్లో 390 పరుగులు చేశాడు. ఈసారి పుజారాను చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో తీసుకున్నారు. కొద్ది రోజుల క్రితం పుజారా చెన్నై జట్టు ప్రాక్టీస్ సెషన్‌లో పాల్గొన్నట్లు ఒక చిత్రం విడుదలైంది.
 
2. అర్జున్ టెండూల్కర్ అరంగేట్రం
సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ తొలిసారిగా ఐపీఎల్‌లో ఆడనున్నాడు. ఐపీఎల్ వేలంలో అర్జున్‌ను మూల ధర రూ.20 లక్షలకు ముంబై ఇండియన్స్ జట్టు కొనుగోలు చేసింది. ఐపీఎల్ 2020లో ఈ కుర్రాడు ముంబై ఇండియన్స్ జట్టులో నెట్ బౌలర్‌గా ఉన్నాడు. ఇప్పటివరకూ అర్జున్ భారత అండర్-19 జట్టులో, ముంబై అండర్-19 జట్టులో ఆడాడు. అప్పుడప్పుడూ భారత జట్టుతో నెట్ ప్రాక్టీస్ చేస్తూ కనిపించేవాడు. ఈ ఏడాది జనవరిలో జరిగిన సయ్యద్ ముష్తాక్ అలీ ట్రోఫీలో ఆడి టీ20లో అరంగేట్రం చేశాడు.

 
లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్‌గా బంతిని బాగా స్వింగ్ చెయ్యగలడని పేరు తెచ్చుకున్నాడు. బ్యాటింగ్ కూడా బాగా చెయ్యగలడు. 2017-18 కూచ్ బెహర్ ట్రోఫీలో ముంబై అండర్-19 జట్టు తరపున ఆడి 19 వికెట్లు తీశాడు. క్రికెట్‌కు మక్కాలాంటి లార్డ్స్ ఇండోర్ అకాడమీలో ప్రాక్టీస్ చేసే అవకాశం అర్జున్‌కు లభించింది. ఆ సమయంలో దక్షిణాఫ్రికా సీరీస్‌కు సిద్ధమవుతున్న ఇంగ్లండ్ జట్టుతో కలిసి ప్రాక్టీస్ చేశాడు. తన ఆటతీరుతో ఇంగ్లండ్ ఆటగాళ్ల మెప్పు పొందాడు.

 
3. రిషభ్ పంత్, సంజూ శాంసన్ కెప్టెన్సీ బాధ్యతలు స్వీకరిస్తారు
ఈ ఐపీఎల్ సీజలో ఇద్దరు కొత్త కెప్టెన్లు కనిపించనున్నారు. గత సీజన్లో అజింక్య రహానే స్థానంలో స్టీవ్ స్మిత్‌ను రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా తీసుకొన్నారు. అయితే, స్మిత్ నాయకత్వంలో జట్టు అనుకున్నంతగా రాణించకపోవడంతో ఈసారి కెప్టెన్సీ పగ్గాలను యువ బ్యాట్స్‌మన్ సంజు శాంసన్‌కు అప్పగించనున్నారు. 26 ఏళ్ల సంజు శాంసన్ ఇప్పటివరకు ఐపీఎల్‌లో 107 మ్యాచ్‌ల్లో 2584 పరుగులు చేశాడు. సగటున 133.74 పరుగులతో రెండు సెంచరీలు కూడా చేశాదు.

 
2008లో రాజస్థాన్ రాయల్స్ ఐపీఎల్ ఛాంపియన్‌గా నిలిచింది. ఆ తరువాత ఒక్కసారి కూడా కప్పును అందుకోలేకపోయింది. ఇప్పటివరకూ షేన్ వార్న్, షేన్ వాట్సన్, రాహుల్ ద్రావిడ్, అజింక్య రహానే, స్టీవ్ స్మిత్ కెప్టెన్లుగా వ్యవహరించిన రాజస్థాన్ రాయల్స్ జట్టును సంజు ఎలా ముందుకు నడిపిస్తాడో చూడాలి. జట్టులో ఉన్న యువ ఆటగాళ్లతో పాటు బెన్ స్టోక్స్, జోస్ బట్లర్, క్రిస్ మారిస్, డేవిడ్ మిల్లర్‌లాంటి అనుభవజ్ఞులైన ఆటగాళ్లతోనూ సమర్థంగా వ్యవహరించడం సంజు ముందున్న సవాలు. మరోవైపు 23 ఏళ్ల యువ ఆటగాడు రిషభ్ పంత్ దిల్లీ క్యాపిటల్స్‌కు సారథ్యం వహించనున్నాడు.

 
భుజానికి గాయం కారణంగా దిల్లీ జట్టు కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ ఈసారి ఐపీఎల్‌కు దూరం అవుతున్నాడు. అతని స్థానంలో జట్టు వైస్ కెప్టెన్ రిషభ్ పంత్‌కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించనున్నారు. గతంలో దేశీయ క్రికెట్‌లో రిషభ్ దిల్లీ జట్టుకు సారథ్యం వహించాడు. వీరేందర్ సెహ్వాగ్, గౌతమ్ గంభీర్, దినేష్ కార్తీక్, జేమ్స్ హోప్స్, మహేలా జయవర్ధనేతో సహా 13మంది ఆటగాళ్లు దిల్లీ క్యాపిటల్స్‌కు కెప్టెన్లుగా వ్యవహరించారు. ప్రస్తుతం కెప్టెన్సీ పోటీలో ఆర్ అశ్విన్, స్టీవ్ స్మిత్, శిఖర్ ధావన్‌లాంటి సీనియర్ ఆటగాళ్లు ఉన్నప్పటికీ యువ ఆటగాడు కావడంతో రిషభ్‌కు కెప్టెన్సీ పగ్గాలు అందించారు. ఇప్పటివరకూ దిల్లీ క్యాపిటల్స్ ఒక్కసారి కూడా ఐపీఎల్ ట్రోఫీ గెలవలేదు. కాగా, గత సీజన్లో ఫైనల్స్‌కు చేరుకుంది.

 
4. అన్ని మ్యాచులూ తటస్థ (న్యూట్రల్ వెన్యూ) మైదానంలోనే జరగనున్నాయి
కరోనా కారణంగా అన్ని జట్లూ న్యూట్రల్ గ్రౌండ్స్‌లోనే మ్యాచులు ఆడనున్నాయి. ఈసారి ఐపీఎల్ మ్యాచ్‌లు బెంగళూరు, అహ్మదాబాద్, ముంబై, చెన్నై, దిల్లీ, కోల్‌కతాలలో జరుగనున్నాయి. మొత్తం సీరీస్‌లో ఏ జట్టు అయినా కేవలం మూడు సార్లు మాత్రమే ప్రయాణించేలా సిరీస్ షెడ్యూల్ తయారు చేశారు. ఐపీఎల్ నిబంధనల ప్రకారం.. అన్ని జట్లూ సిరీస్‌లో ఏడు మ్యాచులు తమ సొంత మైదానంలో ఆడతాయి. మిగతా ఏడు మ్యాచులూ వేరే చోట్ల ఆడతాయి. సొంత మైదానంలో ఆడడం వలన కలిగే ప్రయోజనాలను ప్రతి జట్టుకూ అందించడానికి ఈ ఏర్పాటు చేశారు. కానీ, ఈసారి కరోనా కారణంగా అన్ని జట్లూ అన్ని మ్యాచులూ న్యూట్రల్ గ్రౌండ్స్‌లోనే ఆడతాయి. అంతే కాకుండా, ఈసారి మ్యాచులు చూడ్డానికి ప్రేక్షకులు ఉండరు.

 
5. ముంబై ఆధిపత్యం
దేశీయ క్రికెట్‌లో ముంబై జట్టును బలమైన జట్టుగా పరిగణిస్తారు. అందుకే ఐపీఎల్‌లో ముంబై ఆటగాళ్లు తమ సత్తా చూపిస్తుంటారు. ముంబై తరఫున ఆడిన రోహిత్ శర్మ, సూర్య కుమార్ యాదవ్, ధావల్ కులకర్ణి, ఆదిత్య తారే, అర్జున్ టెండూల్కర్ ముంబై ఇండియన్స్ జట్టులో ఉన్నారు. రోహిత్ శర్మ కెప్టెన్సీలో ముంబై ఇండియన్స్ జట్టు ఐదుసార్లు ఐపీఎల్ టైటిల్ గెలుచుకుంది.
 
ముంబై జట్టుకు చెందిన సర్ఫరాజ్ ఖాన్ ఐపీఎల్‌లో పంజాబ్ కింగ్స్ జట్టు‌లో ఆడుతున్నాడు. యస్థస్వి జైస్వాల్ రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడనున్నాడు. శార్దూల్ ఠాకూర్ చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో ఆడుతుండగా, పృథ్వీ షా దిలీ క్యాపిటల్స్‌కు ఓపెనర్‌గా ఆడుతున్నాడు. మహారాష్ట్ర క్రికెట్ నుంచి భారత జట్టుకు ప్రమోట్ అయిన కేదార్ జాదవ్ ఈసారి ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు తరపున ఆడుతున్నాడు.

 
6. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఇప్పుడు 'పంజాబ్ కింగ్స్'
ఐపీఎల్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు ఒక్కసారి కూడా కప్పు గెలవలేకపోయింది. కెప్టెన్లను మార్చి, జట్టును అటు ఇటూ మార్చినా ఫలితం లేకపోయింది. అందుకని, ఇప్పుడు జట్టు పేరు మార్చారు. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఇప్పుడు 'పంజాబ్ కింగ్స్' అయింది.

 
7. ఆన్ ఫీల్డ్ అంపైర్ నుంచీ సాఫ్ట్ సిగ్నల్ ఉండదు
మూడో అంపైర్ నిర్ణయానికి వెళ్లే ముందు అన్ ఫీల్డ్ అంపైర్ నిర్ణయానికి ప్రాముఖ్యం ఉంటుంది. కానీ, ఈసారి ఐపీఎల్‌లో ఆన్ ఫీల్డ్ అంపైర్ ఇచ్చే సాఫ్ట్ సిగ్నల్‌కు ప్రాముఖ్యం ఉండదు. ఆన్ ఫీల్డ్ అంపైర్ నిర్ణయంపై ఆధారపడకుండా థర్డ్ అంపైర్ స్వతంత్ర్యంగా నిర్ణయం తీసుకోవచ్చు.

 
8. 90 నిముషాలలో ఇన్నింగ్స్ పూర్తి చేయడం తప్పనిసరి
ఐపీఎల్ మ్యాచులు నిర్ణీత సమయం కన్నా ఎక్కువసేపు తీసుకుంటాయనే ఫిర్యాదులు ఉన్నాయి. వాటికి జవాబుగా ఈసారి ఐపీఎల్లో 90 నిముషాల కచ్చితమైన సమయం పాటించనున్నారు. ప్రతీ జట్టు తమ ఇన్నింగ్స్‌ను 90 నిముషాల్లో ముగించాలి. ఈ నిబంధన ఉల్లంఘిస్తే కెప్టెన్‌తో సహా జట్టుకు జరిమానా విధిస్తారు. ఏదైనా జట్టు రెండుసార్లు ఈ నిబంధనను ఉల్లంఘిచినట్లయితే కఠిన శిక్షలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. జట్టు కెప్టెన్‌‌ను కొన్ని మ్యాచుల నుంచి నిషేధించే అవకాశం కూడా ఉంటుంది.

 
9. గంటలోపే సూపర్ ఓవర్
ఏదైనా మ్యాచ్ టై అయితే గంటలోపే సూపర్ ఓవర్ ద్వారా నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే ఇరు జట్లకు చెరొక పాయింట్ కేటాయిస్తారు.

 
10. థర్డ్ అంపైర్ షార్ట్ రన్ నిర్ణయం తీసుకుంటాడు
ఇప్పటివరకూ షార్ట్ రన్ విషయంలో తుది నిర్ణయం ఫీల్డ్ అంపైర్ తీసుకునేవాడు. కానీ, ఇప్పుడు అది థర్డ్ అంపైర్ చేతుల్లోకి వెళ్లనుంది. షార్ట్ రన్ విషయంలో ఫీల్డ్ అంపైర్ తప్పుడు నిర్ణయం తీసుకున్నట్లు థర్డ్ అంపైర్ భావిస్తే, ఆ నిర్ణయాన్ని మార్చే అవకాశం థర్డ్ అంపైర్‌కు ఉంటుంది. అలాగే, నో బాల్‌పై కూడా థర్డ్ అంపైర్ తుది నిర్ణయం తీసుకోవచ్చు.

 
11. ఐపీఎల్‌కు దూరమైన ఆటగాళ్లు
చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో ఆడిన ఆస్ట్రేలియా క్రికెటర్ షేన్ వాట్సన్, ముంబై ఇండియన్స్ జట్టులో ఆడిన శ్రీలంక క్రికెటర్ లసిత్ మలింగ గత సీజన్‌లోనే తమ రిటైర్మెంట్ ప్రకటించారు. వీరితో పాటూ మిచెల్ స్టార్క్, జోష్ హాజల్‌వుడ్, మిచెల్ మార్ష్, జోస్ ఫిలిప్, డేల్ స్టెయిన్, శ్రేయాస్ అయ్యర్ కూడా ఈ సీజన్‌లో ఆడట్లేదు. బయో బబుల్‌లో రెండు నెలలు ఉండాలన్న సవాలును దృష్టిలో పెట్టుకుని హాజల్‌వుడ్ స్వతంత్రంగా ఈ సీజన్ ఐపీఎల్ నుంచి వైదొలిగారు. మిచెల్ మార్ష్, శ్రేయాస్ అయ్యర్ గాయాలతో ఈ సీజన్‌కు దూరం కానున్నారు. డేల్ స్టెయిన్ అందుబాటులో ఉండనని ముందే చెప్పేశాడు.