గురువారం, 28 మార్చి 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By pnr
Last Updated : శుక్రవారం, 11 డిశెంబరు 2015 (16:28 IST)

చర్మానికి హానికలిగించే చలికాలం... జర జాగ్రత్త...

చలికాలంలో చర్మానికి ఎంతో హాని కలుగుతుంది. చలి ప్రభావం నేరుగా చర్మంపైనే పడుతుంది. ఈ సీజన్‌లో బయటి తేమ తగ్గడంతో దాన్ని చర్మం నుంచి వాతావరణం లాగేస్తుంటుంది. ఫలితంగా చర్మం పొడిబారిపోతుంది. దాంతో అందరూ చర్మ సమస్యల బారిన పడుతుంటారు. ఈ సీజన్‌లో మేనికి మేలు చేసే మార్గాలేంటో పరిశీలిస్తే... 
 
* రాత్రి వేళలో తిరిగేవారు వ్యాజిలేన్ రాసుకోవాలి. ఇక పగటి ఎండలోకి వెళ్లేవారు ట్యానింగ్‌ను, సన్ అలర్జీస్ నివారించడానికి సన్‌స్క్రీన్ లోషన్ ఉపయోగించడం చాలా ముఖ్యం. అయితే జిడ్డు చర్మం ఉన్న టీనేజ్ పిల్లలు నూనె లేని (ఆయిల్ ఫ్రీ) సన్‌స్క్రీన్స్ రాసుకోవాలి. అలాగే పొడి చర్మం ఉన్నవారు మాయిష్చరైజర్ ఎక్కువగా ఉండే ఆయిల్ బేస్ సన్‌స్క్రీన్స్ రాసుకోవాలి.
 
* ఈ సీజన్‌లో సాధారణంగా కోల్డ్ క్రీమ్స్ వాడటం పెరుగుతుంది. అయితే ఎలాంటి క్రీములు ఎంపిక చేసుకోవాలనే అంశం చాలామందికి అవగాహన ఉండదు. ఈ సీజన్‌లో వాడాల్సిన కోల్డ్ క్రీమ్స్ సువాసనరహితంగా ఉండటం మంచిది. ఎంత వాసన తక్కువైతే చర్మంపై వాటి దుష్ప్రభావం అంతగా తగ్గుతుంది.
 
* స్నానానికి అరగంట ముందు ఒంటికి ఆలివ్ లేదా కొబ్బరి నూనె పట్టించాలి. స్నానానికి మాయిశ్చరైజింగ్ సబ్బు వాడాలి.
* స్నానం చేసి, కాస్త తడిగా ఉన్నప్పుడే డీప్ మాయిశ్చరైజింగ్ క్రీమ్‌ను రాయాలి. రోజుకు 3, 4 సార్లు ఈ క్రీమ్ రాయాలి.
* చలికాలంలో వేడినీళ్లు మంచివని కొందరు అంటుంటారు. అయితే ఈ సీజన్‌లో వాతావరణం తేమను లాగేస్తుందన్న విషయం తెలిసిందే. వేడినీళ్లు కూడా ఇందుకు దోహదపడి ఇంకా పొడిబారుస్తాయి. కానీ చన్నీళ్లు ఆస్తమాను ప్రేరేపించవచ్చు. అందుకే స్నానానికి వేడి వేడి నీళ్లకు బదులు గోరువెచ్చని నీటినే వాడాలి.
 
* పాదాలకూ, చేతులకూ కాటన్ గ్లౌజ్ వేసుకోవడం మంచిది. అది పగుళ్లను నివారిస్తుంది.
* తలస్నానం చేయడానికి రెండు గంటల ముందర మాడుకు నూనె మసాజ్ చేసుకోవాలి. నూనె కండిషనర్‌గా పనిచేస్తుంది. పొడిజుట్టు ఉన్నవారైతే షాంపూ తర్వాత తప్పనిసరిగా కండిషనర్ వాడాలి.
* తడి జుట్టును ఆరబెట్టుకోడానికి డ్రైయర్ వాడకూడదు. ఎందుకంటే అది చర్మాన్ని మరింత పొడిబారుస్తుంది.