గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. బడ్జెట్ 2016-17
Written By JSK
Last Updated : సోమవారం, 29 ఫిబ్రవరి 2016 (19:02 IST)

ఏపీ, తెలంగాణలకు అరుణ్ జైట్లీ 2016 బడ్జెట్ మొండిచేయి...

బడ్జెట్ 2016-17లో ఏపీ-తెలంగాణలకు రిక్త హస్తం

విజ‌య‌వాడ: విభ‌జ‌న తెచ్చిన తంటా... బ‌డ్జెట్లో ప్రాధాన్యం లేదంట‌!! ఇది ఇపుడు అరుణ్ జైట్లీ బ‌డ్జెట్ పైన తెలుగు రాష్ట్రాల స్పంద‌న‌. అటు తెలంగాణాకు... ఇటు ఆంధ్రాకు రెంటికీ అన్యాయం జ‌రిగింది. ఏపీకి ప్ర‌త్యేక ప్యాకేజీగాని, ప్ర‌త్యేక ప్ర‌తిప‌త్తి గాని హుళ‌క్కే అయింది. అటు తెలంగాణాకూ ఏ పెద్ద కేటాయింపూ లేదు. ఇది ఎన్నిక‌ల ఇయ‌ర్ కాదు... ఏమిచ్చినా వీళ్ల‌కి ఏం లాభం అనుకున్న‌ట్లున్నారు బీజేపీ నేత‌లు. కొత్త‌గా విడిపోయిన ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రానికి అసెంబ్లీకి గాని, సెక్ర‌టేరియేట్‌కి గాని లేక‌... తాత్కాలిక రాజ‌ధాని విజ‌య‌వాడ‌లో సీఎం చంద్ర‌బాబు ప‌రిపాల‌న నెట్టుకొస్తున్నారు.
 
ఈ సాధార‌ణ బ‌డ్జెట్లో ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తి ఊసే లేదు. పైగా పోల‌వ‌రం ప్రాజెక్టుకు కేవ‌లం రూ.100 కోట్లు కేటాయించారు. దీనికి సీఎం చంద్ర‌బాబు 4 వేల కోట్లు ఇవ్వాల‌ని కేంద్రాన్ని అభ్య‌ర్థించారు. ఇక విజయవాడ మెట్రోకు రూ.100 కోట్లు ఇస్తున్నట్లు కేంద్ర ఆర్ధిక మంత్రి ప్ర‌కటించారు. ఏపీలో ట్రిపుల్‌ ఐటీలకు రూ.20 కోట్లు, తిరుపతి ఐఐటీకి రూ.40 కోట్లు, విశాఖ ఐఐఎంకు రూ.30 కోట్లు, తాడేపల్లిగూడెం ఎన్‌ఐటీకి రూ.40 కోట్లు, తిరుపతి ఐఐఎస్‌సీఆర్‌కు రూ.40 కోట్లు, గిరిజన విశ్వవిద్యాలయానికి రూ.కోటి ఇచ్చి చేతులు దులిపేసుకున్నారు. ఈ నిధుల‌తో ఎటు నుంచి అభివృద్ధి న‌రుక్కురావాలో తెలియ‌క తెలుగుదేశం ప్ర‌భుత్వం తిక‌మ‌క‌ప‌డుతోంది.
 
తెల్ల‌బోయిన తెలంగాణా...
కేంద్ర బడ్జెట్‌పై తెలుగు ప్ర‌జ‌లు ఏ ఒక్కరూ సంతోషంగా లేరు. తెలంగాణా రాష్ట్రం ఏర్పడ్డ స్పృహే కేంద్రానికి లేద‌ని తెలంగాణా నాయ‌కులు విమ‌ర్శిస్తున్నారు. కేంద్ర పన్నుల్లో తెలంగాణ వాటా రూ. 13,955.35 కోట్లుగా వెల్లడించారు. తెలంగాణకు చెందిన విద్యా సంస్థలకు బడ్జెట్‌ గిరిజన విశ్వవిద్యాలయానికి రూ.కోటి., ఐఐటీకి రూ.20 కోట్లు కేటాయిస్తున్నట్లు ఆర్థిక మంత్రి ప్రకటించారు. ఇవి త‌ప్ప ఏ ప్ర‌త్యేక‌త‌లు రెండు తెలుగు రాష్ట్రాల‌కు లేక‌పోవ‌డం గ‌మ‌నార్హం.