శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. బడ్జెట్ 2016-17
Written By pnr
Last Updated : సోమవారం, 29 ఫిబ్రవరి 2016 (13:19 IST)

రూ.5 లక్షల లోపు ఆదాయం ఉంటే.. రూ.3 వేలు మినహాయింపు .. అరుణ్ జైట్లీ

దేశవ్యాప్తంగా రూ.5 లక్షలలోపు వార్షిక ఆదాయం ఉన్నవారి పట్ల కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ కనికరం చూపారు. వీరికి పన్ను రాయితీ ప్రకటించారు. ఇకపై వారందరికీ ఆదాయపు పన్ను రూ.2 వేలు మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. అంటే రూ.3 వేలు మినహాయింపు ఇచ్చారు. పన్ను రాయితీ ద్వారా కోటి మంది చెల్లింపుదారులకు ప్రయోజనం కలుగుతుందని జైట్లీ తన ప్రసంగంలో పేర్కొన్నారు. 
 
మరోవైపు అద్దె ఇళ్లలో నివాసం ఉండేవారికి అద్దె మినహాయింపు ప్రకటించారు. ఇంటి అద్దెపై రూ.24 వేల నుంచి రూ.60 వేలకు మినహాయింపు ఉంటుందని తెలిపారు. సొంత ఇల్లు లేని, హెచ్ఆర్ఏ పొందని ఉద్యోగులకు ఈ మినహాయింపు వర్తిస్తుంది. స్టార్టప్‌ల ద్వారా పొందే లాభాలపై మూడేళ్లపాటు వంద శాతం పన్ను రాయితీ ఇచ్చారు. చిన్న పరిశ్రమలకు 29 శాతమే ట్యాక్స్ ఉండేలా చూస్తామన్న మంత్రి అరుణ్ జైట్లీ హామీ ఇచ్చారు.
 
అంతేకాకుండా, యేడాదిలోపు పన్ను చెల్లింపు వివాదాలను తీసుకొస్తామన్నారు. అంతేకాక పన్నుల చెల్లింపులను సెటిల్‌ చేసుకుంటే వారిపై కేసులు ఉండవని వెల్లడించారు. పన్నుల వివాదంలో అప్పీళ్లను తగ్గిస్తున్నామన్నారు. ఏడాదికి రూ.50 కోట్లు కూడా ఆదాయం రాని 13 రకాల సెస్‌లను రద్దు చేస్తున్నట్లు జైట్లీ తెలిపారు. 
 
పోస్టాఫీసుల్లో మైక్రో ఏటీఎంలు ఎర్పాటు చేస్తున్నట్లు అరుణ్ జైట్లీ తెలిపారు. అర్హులకు మాత్రమే ప్రభుత్వ సబ్సిడీ అందేలా చేస్తామన్నారు. ప్రభుత్వ పథకాలకు ఆధార్‌ లింక్‌ తప్పని సరి చేస్తామన్నారు. దీంతో నేరుగా ప్రభుత్వ సబ్సిడీలు లబ్దిదారులకు అందేలా అవుతుందని ఆయన అన్నారు.
 
పారిశ్రామిక రంగంలో ఎస్సీ, ఎస్టీలను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. దళిత్ ఇండియన్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీతో కలిసి పారిశ్రామికవాడలను ఏర్పాటు చేస్తామన్నారు. స్టాండప్ ఇండియా పథకం కోసం రూ.500 కోట్లు కేటాయించాలని ప్రతిపాదించినట్లు తెలిపారు. ఈ ఏడాది ఎస్సీ, ఎస్టీల పారిశ్రామికవేత్తల సంవత్సరంగా మారాలన్నారు.