మంగళవారం, 19 మార్చి 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. బడ్జెట్ 2017-18
Written By pnr
Last Updated : మంగళవారం, 31 జనవరి 2017 (12:18 IST)

పెద్ద నోట్ల రద్దుతో నల్లధనం, అవినీతి గణనీయంగా తగ్గాయి: ప్రణబ్ ముఖర్జీ

దేశంలో పెద్ద నోట్ల రద్దుతో బ్లాక్ మనీ, అవినీతి గణనీయంగా తగ్గాయని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అన్నారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల సందర్భంగా రాష్ట్రపతి ఉభయ సభలనుద్దేశించి మంగళవారం ప్రసంగించారు. ఈ సందర్భం

దేశంలో పెద్ద నోట్ల రద్దుతో బ్లాక్ మనీ, అవినీతి గణనీయంగా తగ్గాయని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అన్నారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల సందర్భంగా రాష్ట్రపతి ఉభయ సభలనుద్దేశించి మంగళవారం ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వచ్ఛ భారత్‌ను ప్రజా ఉద్యమంలా చేపట్టామన్నారు. కోటి 20 లక్షల మంది గ్యాస్ సబ్సిడీని వదులుకోవడం ప్రశంసనీయమని కొనియాడారు. దీన్ దయాళ్ గరీబ్ కల్యాణ్ పథకం ద్వారా పేదల సంక్షేమానికి ఎన్నో ముఖ్య చర్యలు ప్రభుత్వం చేపడుతోందన్నారు. 26 కోట్ల జన్‌ధన్ ఖాతాలు తెరిచినట్టు చెప్పారు. బ్లాక్‌మనీ, అవినీతి గణనీయంగా తగ్గాయన్నారు. నగదు రహిత విధానం సమర్ధంగా అమలవుతోందని స్పష్టంచేశారు. 
 
రైతులు, కూలీలు, పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. పారిశ్రామికీకరణతో ఉపాధి అవకాశాలు పెంచేందుకు కృషి చేస్తామన్నారు. కోటి మంది యువతకు వృత్తి నైపుణ్య శిక్షణ ఇస్తున్నామన్నారు. ఈ ఏడాది 20 లక్షల టన్నుల పప్పుధాన్యాలు సేకరించడమే లక్ష్యమన్నారు. నాబార్డు మూల నిధి రూ.41వేల కోట్లకు పెంచామని రాష్ట్రపతి తెలిపారు. ప్రసూతి సెలవులు 12 వారాల నుంచి 26 వారాలకు పెంచామని గుర్తు చేశారు. 
 
"సబ్ కా సాథ్.. సబ్ కా వికాస్" తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతో నిత్యావసర వస్తువుల ధరలు దిగొచ్చాయని, ద్రవ్యోల్బణం అదులో ఉందన్నారు. రూ.12 వేల కోట్లతో ప్రారంభమైన ప్రధానమంత్రి సోషల్ వికాస్ యోజన విజయవంతమైందని అన్నారు. వచ్చే నాలుగేళ్లలో కోటి మంది యువత ఈ పథకం కింద లబ్దిని పొందనుందని తెలిపారు. దేశవ్యాప్తంగా ఉన్న 978 ఉపాధి కల్పనా కార్యాలయాలను ఒకే గొడుగు కిందకు తెచ్చిన ఘనత తన ప్రభుత్వానిదేనని వెల్లడించారు. ఔత్సాహికులను ప్రోత్సహించేందుకు ఇప్పటికే కేటాయించిన నిధుల మొత్తాన్ని తదుపరి బడ్జెట్‌లో మరింతగా పెంచనున్నట్టు తెలిపారు. 
 
మహిళా శక్తిని తన ప్రభుత్వం గుర్తించిందని, వారి సాధికారతకు కట్టుబడి ఉన్నామన్నారు. భారత ఖ్యాతిని రియో ఒలింపిక్స్‌లో మహిళలు ప్రపంచానికి చాటి చెప్పారని కొనియాడారు. పీవీ సింధు, సాక్షి మాలిక్, దీపా కర్మాకర్ తదితరులు భారత స్త్రీ శక్తిని చాటారని అన్నారు. ఇప్పటికే భారత సైన్యంతో పాటు వాయు సేనలో యుద్ధ విమానాల పైలట్లుగానూ మహిళలు పని చేస్తున్నారని తెలిపారు. బాల బాలికల నిష్పత్తిలోనూ మెరుగైన గణాంకాలు వస్తున్నాయని ప్రణబ్ వెల్లడించారు. భ్రూణ హత్యలను నివారించేందుకు కఠిన చట్టాలను తీసుకువచ్చామని తెలిపారు. 
 
ప్రభుత్వ విధానాలు పేదలకు ఉపయోగపడుతున్నాయని, చిన్న వ్యాపారులకు గతంలో ఎన్నడూ లేనంత ప్రోత్సాహం లభిస్తోందని వెల్లడించారు. 18 వేల గ్రామాలకు కొత్తగా విద్యుత్ సౌకర్యాన్ని అందించామని, 20 కోట్ల రూపే డెబిట్ కార్డులను పేదలకు అందించామని ప్రణబ్ ముఖర్జీ గుర్తు చేశారు. 20 కోట్లకుపైగా ఎల్ఈడీ బల్బులను పంచామని, ప్రధానమంత్రి ముద్ర యోజన కింద 5.6 కోట్ల మందికి రుణ సౌకర్యం కల్పించామని తెలిపారు. ఉజ్వల్ యోజన ప్రయోజనాలు 37 శాతం షెడ్యూల్ కులాలకు దగ్గరైనాయని అన్నారు. 
 
భారత క్రికెట్ జట్టు అసమాన విజయాలను అందుకుంటోందని ప్రణబ్ తెలిపారు. క్రికెట్‌తో పాటు మిగతా ఆటలకూ తన ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని, ఆ ఫలాలు అందుతున్నాయని, ఒలింపిక్స్, పారా ఒలింపిక్స్‌లో సాధించిన పతకాలే ఇందుకు నిదర్శనమని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ వ్యాఖ్యానించారు.