మంగళవారం, 16 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 2 మే 2016 (13:16 IST)

రైలు చార్జీలు పెంచకుంటే రైల్వే శాఖ మనుగడ కష్టం : కాగ్ హెచ్చరిక

ప్రస్తుత పరిస్థితుల్లో తక్షణ రైలు చార్జీలను పెంచకపోతే రైల్వే శాఖ మనుగడ సాగించడం కష్టమేనని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) హెచ్చరించింది. ఇదే అంశంపై కాగ్ ఓ నివేదికను బహిర్గతం చేసింది. ప్రయాణీకుల చార్జీలు తక్కువగా ఉండటం వల్ల రైల్వేకు ప్రతి యేటా నష్టం వాటిల్లుతున్నట్టు పేర్కొంది. ముఖ్యంగా 2009-10లో రూ.20,080.47 కోట్లుగా ఉన్న నష్టం, ఆ తర్వాత సంవత్సరాలలో రూ.20,948.35 కోట్లు, రూ.23,643.68 కోట్లు, రూ.26,025.46 కోట్ల నుంచి 2013-14 నాటికి రూ.31,727.44 కోట్లకు చేరుకుందని కాగ్‌ వివరించింది. 
 
రైళ్లు నడపడానికి అయ్యే ఖర్చులను కూడా ప్రయాణికుల నుంచి చార్జీల రూపేణా రాబట్టడం లేదని కాగ్ తేల్చి చెప్పింది. అందుకే దశలవారీగా రైలు ప్రయాణికులపై భారం మోపాలని పేర్కొంది. అలాగే, రైళ్ల నిర్వహణ వ్యయంతో పోలిస్తే చార్జీల ద్వారా వస్తున్న ఆదాయం 2013-14లో 42.21 శాతం తక్కువని కాగ్‌ తెలిపింది. ఆ నష్టాన్ని పూడ్చుకునేందుకు సరకు రవాణాతో వచ్చిన లాభాలను మళ్లిస్తున్నారని కాగ్‌ వివరించింది. 
 
2013-14లో సరకుల రవాణా ద్వారా రూ.32641.69 కోట్ల లాభం రాగా, అందులో 97.20 శాతం అంటే రూ.31727.44 కోట్లను ప్రయాణీకుల నష్టాన్ని పూడ్చేందుకు రైల్వే శాఖ వినియోగించింది. అయితే, థర్డ్‌ ఏసీతో మాత్రం లాభాల పంట పండుతోంది. థర్డ్‌ ఏసీలో ప్రయాణికుల వల్ల 2013-14లో రైల్వేకు రూ.410.67 కోట్ల ఆదాయం వచ్చింది. ఇక సాధారణ తరగతి వల్ల ఎక్కువగా రూ.11105.24 కోట్ల నష్టం వాటిల్లగా, స్లీపర్‌క్లా‌స్‌లో రూ.8407.85 కోట్లు, సెకండ్‌ క్లాస్‌లో రూ.7134.42 కోట్ల మేరకు నష్టం వాటిల్లినట్టు కాగ్ తన నివేదికలో పేర్కొంది.