శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 21 ఏప్రియల్ 2015 (11:16 IST)

భారతీయ రైల్వేలో రూ.4వేల కోట్ల స్కామ్?: రంగంలోకి దిగిన సీబీఐ

భారతీయ రైల్వేల్లో సుమారు రూ.4వేల కోట్ల విలువైన స్కామ్ జరిగిందని సీబీఐ అనుమానిస్తోంది. ప్రపంచంలోని అతిపెద్ద రైల్వే నెట్ వర్క్‌ను కలిగివున్న భారతీయ రైల్వేలో కంప్యూటర్ సాఫ్ట్ వేర్ సహాయంతో గణాంకాలు మార్చి అక్రమార్కులు వేల కోట్ల రూపాయలు నొక్కేశారని పసిగట్టిన సీబీఐ రంగంలోకి దిగింది. సరకు రవాణా విషయంలో వాస్తవ బరువును దాచి గూడ్స్ వాగన్‌లను నడిపించారన్నది సీబీఐ గుర్తించిన కుంభకోణం.
 
ఈ విషయమై అతి త్వరలో కేసును నమోదు చేయనున్నట్టు సమాచారం. 2012-13లో మొత్తం 100 కోట్ల మెట్రిక్ టన్నులకుపైగా సరకు రవాణా చేసిన రైల్వేలు మొత్తం రూ. 85,262 కోట్ల రూపాయల ఆదాయాన్ని పొందాయి. మొత్తం రైల్వేల ఆదాయంలో ఇది 67 శాతం. సరుకును గూడ్స్ బోగీల్లోకి ఎక్కించే ముందు, మార్గ మధ్యంలో, ఆపై చేరాల్సి చోటికి చేరిన తరువాత బరువును నమోదు చేయాల్సి వుంటుంది.
 
బోగీల బరువును నిర్దేశిత పరిమితుల్లోనే చూపి అధికంగా లోడ్ చేయడం ద్వారా వీరు కోట్ల రూపాయలు నొక్కేశారని సీబీఐ అధికారి ఒకరు తెలిపారు. అత్యంత అధునాతన పద్ధతులు, సాంకేతికతను వాడుకొని సాఫ్ట్ వేర్ సిస్టమ్ సహాయంతో వీరు తప్పుడు మార్గాల్లో నడిచారని అనుమానిస్తున్నట్టు వివరించారు.