బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 4 డిశెంబరు 2015 (13:01 IST)

చెన్నై భారీ వర్షాలు - వరదలు : ఆటో ఇండస్ట్రీకి రూ.1500 కోట్లు నష్టం

చెన్నైను ముంచెత్తిన భారీ వర్షాలు, వరదల కారణంగా అపార నష్టం వాటిల్లింది. ఈ లెక్కలు ఇపుడిప్పుడే వెలుగులోకి వస్తున్నాయి. ముఖ్యంగా.. ఈ వరదల కారణంగా ఆటో ఇండస్ట్రీ ఒక్కదానికే 1500 కోట్ల రూపాయల మేరకు నష్టం వాటిల్లినట్టు అసోచామ్ ప్రాథమికంగా అంచనా వేసింది. 
 
నిజానికి చెన్నై ఆటో ఇండస్ట్రీ దేశంలో రెండవ అతిపెద్దదిగా ఉంది. దేశ వాహన అవసరాల్లో 25 శాతం వరకూ తీరుస్తోంది. చిన్న, మధ్య తరహా పరిశ్రమలెన్నో విడిభాగాలు ఇక్కడే తయారవుతున్నాయి. ఇప్పుడీ కంపెనీల్లో మూడు నుంచి నాలుగడుగుల మేరకు నీరు నిండిపోయింది. వాహన సంస్థలతో పాటు ఇంజనీరింగ్, టెక్స్ టైల్స్ తదితర విభాగాల్లోని కంపెనీలూ దారుణంగా దెబ్బతిన్నాయి. 
 
ఇదే అంశంపై అసోచామ్ ఒక ప్రకటన విడుదల చేసింది. 'చెన్నైని ఆదుకునేందుకు ప్రధానమంత్రి సహాయనిధికి విరివిగా విరాళాలు ఇవ్వాలని, సాధ్యమైనంత త్వరగా ప్రజలను కష్టాల కడలి నుంచి బయట పడేసేందుకు కృషి చేయాలంటూ పేర్కొంది. కాగా, నగరంలోని ప్రధాన వాహన తయారీ కంపెనీల యార్డుల్లో సుమారు 20 వేల నుండి 25 వేల వాహనాలు క్రయవిక్రయాలు జరగక నిలిచిపోయాయి. 
 
గత మూడు రోజులుగా ఫోర్డ్ ఇండియా ప్లాంట్ మూతపడగా, ఐదు రోజుల నుంచి రినాల్ట్ నిస్సాన్ ప్లాంట్‌ మూతపడింది. చెన్నై కేంద్రంగా వాహనాల విడిభాగాలు తయారు చేసి ఎగుమతి చేస్తున్న జపాన్ సంస్థ సిన్సాన్, ఆదివారం తర్వాతనే ఉత్పత్తిని తిరిగి చేపట్టనున్నట్టు వెల్లడించింది. హుందాయ్ మోటార్స్ శుక్రవారం నుంచి ఉత్పత్తిని నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. ఈ కంపెనీలన్నీ ఎప్పుడు ఉత్పత్తిని ప్రారంభిస్తాయన్న విషయమై స్పష్టత లేదు.