శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By Raju
Last Modified: హైదరాబాద్ , శనివారం, 1 ఏప్రియల్ 2017 (03:33 IST)

ఒక్క రోజులో వేల వాహనాలు కొనేసారు.. నోస్టాక్ బోర్డులు.. లోపల బినామీల పండగ

దేశవ్యాప్తంగా నగరాల్లోని వాహన షోరూమ్‌లు ఒకరోజు పండగ చేసుకున్నాయి. బీఎస్-3 ప్రమాణాలు కలిగిన వాహనాలపై ఏప్రిల్ 1 నుంచి నిషేధం విధించిన నేపథ్యంలో శుక్రవారం విపరీతంగా అమ్మకాలు సాగాయి. కోర్టు తీర్పుతో ఆటోమొబైల్ కంపెనీలు ఈ రకం వాహనాలపై భారీ ఆపర్లు ప్రకటించడ

దేశవ్యాప్తంగా నగరాల్లోని వాహన షోరూమ్‌లు ఒకరోజు పండగ చేసుకున్నాయి. బీఎస్-3 ప్రమాణాలు కలిగిన వాహనాలపై ఏప్రిల్ 1 నుంచి నిషేధం విధించిన నేపథ్యంలో శుక్రవారం విపరీతంగా అమ్మకాలు సాగాయి. కోర్టు తీర్పుతో ఆటోమొబైల్ కంపెనీలు ఈ రకం వాహనాలపై భారీ ఆపర్లు ప్రకటించడంతో వినియోగదారులు  పండగ చేసుకున్నారు. ద్విచక్ర వాహనాలపై పది వేల నుంచి 12 వేల వరకు రాయితీ ఇప్వగా, కార్లపై 50 వేలనుంచి 70 వేల వరకు డిస్కాంట్ ఇచ్చారు. 
 
దేశ వాహన విక్రయాల చరిత్రలో ఇంత పెద్ద భారీ రాయితీలు ఇవ్వడం ఇదే తొలిసారి కావడంతో ప్రజలు అంతే స్థాయిలో ఆసక్తి చూపారు.  దీంతోభారత్‌ స్టేజ్‌ –3 వాహనాల అమ్మకాల ఆఖరి రోజైన శుక్రవారం హైదరాబాద్‌లోని ఆటోమోబైల్‌ షోరూమ్‌లు కొనుగోలుదారులతో కిటకిటలాడాయి. స్టాక్ అమ్ముడు పోతుందో లేదో అనుకున్న  వాహన షో రూమ్‌ డీలర్లు బుకింగ్‌ల కోసం బారులు తీరిన జనాలను చూసి చాలా చోట్ల నో స్టాక్ బోర్డులు పెట్టేశారు. 
 
పైగా చాలా షోరూమ్‌లలో బినామీల పేరిట వాహనాలను షోరూమ్ సిబ్బందే బుక్ చేశారన్న ఆరోపణలు వచ్చాయి. రెండు రోజులుగా తమ షోరూమ్‌లలో పని చేసే సిబ్బంది, తెలిసిన వ్యక్తుల పేరిట వాహనాలను తాత్కాలిక రిజిస్ట్రేషన్‌లు చేసినట్లు వినియోగదారులు ఆరోపిస్తున్నారు. దీంతో ఆఫర్లు ఆకర్శించినా.. చాలా చోట్ల నో స్టాక్‌ బోర్డులే దర్శనమిచ్చాయి.  పుణేలో కొటారి వీల్స్ అనే సంస్థ ఒక్కటే పది గంటల్లోపు 500 టూ వీలర్లను అమ్మింది. 
 
చెన్నైలో హోండా మోటార్ సైకిల్ & స్కూటర్ ఇండియా షోరూమ్ కొనుగోలుదారులకు రూ. 13,500 నుంచి 18,500 వరకు మోటర్ సైకిల్స్‌పై రాయితీ ఇచ్చింది. శుక్రవారం రాత్రి 10 గంటల వరకు షోరూమ్‌లవద్ద కస్టమర్లు బారులు తీరి కనిపించారు. ముంబైల అయితే షోరూమ్‌ల వద్ద  కస్టమర్లను అదుపు చేయడానికి పోలీసుల సాయం తీసుకున్నారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం దేశంలో ఈరోజువరకు స్టాక్ ఉన్న బీఎస్-3 ప్రమాణాలు కలిగిన వాహనాలు 6.71, 305 యూనిట్ల స్టాక్ ఉండగా ఒక్కరోజులో ఇవన్నీ మంత్రించినట్లు అమ్ముడవడం రికార్డు. 
 
హీరో, రాయల్ ఎన్‌ఫీల్డ్, టీవీఎస్, హోండా కంపెనీల డీలర్లు శుక్రవారం తమ వద్ద స్టాక్ మొత్తం అమ్మేసినట్లు చెప్పాయి. దీపావళి పండగ సీజన్లో కూడా లేని స్పందన ఈ ఒక్కరోజు ప్రజల నుంచి వచ్చిందని చాలామంది డీలర్లు చెప్పారు. తమాషా విషయం ఏమిటంటే గుడిపడ్వా (ఉగాది) సందర్భంగా మార్చి 28న బజాజ్ ప్లటానియా బండిని కొనుగోలు చేసిన పుణే వాసి రెండు రోజుల్లోపే ఆ వాహనానికి రూ.15 వేల రాయితీ ప్రకటించటం చూసి గుండెబాదుకున్నాడు.
 
భారత వాహన విక్రయాల చరిత్రలో శుక్రవారం ఒక రికార్డు సృష్టించింది. భారీ డిస్కౌంట్లతో సాగిన ఈ ఒక్కరోజు విక్రయాల రికార్డు బహుశా దేశం ఇక ఎన్నడూ చూడక పోవచ్చు కూడా.