గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 26 నవంబరు 2015 (16:45 IST)

తగ్గిన డిమాండ్.. ఆరేళ్ళ కనిష్ట స్థాయికి బంగారం ధరలు

భారత్‌లో బంగారం డిమాండ్ నానాటికీ తగ్గిపోతోంది. ఫలితంగా గురువారం దేశీయంగా బంగారం ధరలు ఆరేళ్ళ స్థాయికి దిగజారాయి. గడచిన పండుగ సీజనులో బంగారం అమ్మకాలు పెంచుకోవాలని భావించిన ఆభరణాల వ్యాపారులకు నిరాశే ఎదురైంది. వరుసగా రెండేళ్లు కరవు పీడించడంతో లక్షలాది మంది రైతుల వద్ద ఆదాయం లేకపోవడం, ధరలు మరింతగా తగ్గుతాయని వచ్చిన విశ్లేషణలతో నూతన కొనుగోళ్లకు ప్రజలు దూరమయ్యారని నిపుణులు వ్యాఖ్యానించారు. 
 
ప్రపంచంలోనే రెండో అతిపెద్ద బంగారం వినియోగదారుగా ఉన్న భారత్‌లో ఈ దసరా - దీపావళి సీజను బంగారం డిమాండ్ ఎనిమిదేళ్ళ కనిష్టానికి చేరుకోగా, అంతర్జాతీయ మార్కెట్లో ఐదేళ్ల కనిష్టస్థాయిలో బంగారం ధరలు కొనసాగుతున్నాయి. గురువారం నాటి ట్రేడింగ్‌లో దేశవాళీ డిసెంబర్ త్రైమాసికం బంగారం డిమాండ్ 175 టన్నుల నుంచి 150 టన్నులకు తగ్గిందని ఆల్ ఇండియా జెమ్స్ అండ్ జ్యూయెలరీ ట్రేడ్ ఫెడరేషన్ డైరెక్టర్ బచ్చారాజ్ బమల్వా వ్యాఖ్యానించారు. ఐదేళ్ల క్రితం ఇదే పండుగ సీజనులో 231 టన్నుల బంగారం దిగుమతి జరుగగా, గత సంవత్సరం సీజనులో 201.6 టన్నుల బంగారానికి డిమాండ్ వచ్చిందని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ గణాంకాలు వెల్లడించాయి.