బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By PNR
Last Updated : శనివారం, 4 జులై 2015 (11:53 IST)

భారత్‌లో తగ్గుతున్న బంగారం ధరలు.. పడిపోతున్న అమ్మకాలు...

భారత్‌లో బంగారం ధరలు క్రమేపీ తగ్గిపోతున్నాయి. దీంతో అమ్మకాలు కూడా పడిపోతున్నాయి. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్‌తో పోల్చితే భారత్‌లో బంగారం ధర బాగా తగ్గిపోయింది. సాధారణంగా ఔన్సు బంగారం ధర ప్రపంచ మార్కెట్లో ఎంత పలుకుతుందో దానికి ఒక డాలర్ (సుమారు రూ.63) అటూ ఇటుగా మనదేశ మార్కెట్లో ధర ఉంటుంది. 
 
కానీ, ఇప్పుడు వివిధ నగరాల్లో 8 నుంచి 15 డాలర్ల (సుమారు రూ.500 నుంచి రూ.950) డిస్కౌంట్ ధరకు బంగారం లభిస్తోంది. అయినప్పటికీ ఆభరణాల అమ్మకాలు అత్యంతమందకొడిగా సాగుతున్నాయి. ప్రపంచంలోనే అత్యధికంగా బంగారం వినియోగించే దేశాల్లో టాప్-2గా భారత్‌ ఉంది. కానీ, బంగారం ధర గత మూడున్నర నెలల కనిష్ట స్థాయికి చేరుకుంది. ఇది అంతర్జాతీయ బులియన్ మార్కెట్‌తో పోలిస్తే 3 శాతం తక్కువగా ఉంది. 
 
అయితే, దేశంలో చోటుచేసుకుంటున్న వివిధ పరిస్థితుల కారణంగా బంగారు నగల విక్రయాలుపడిపోతున్నాయని ఆల్ ఇండియా జెమ్స్ అండ్ జ్యూయలరీ ట్రేడ్ ఫెడరేషన్ డైరెక్టర్ బచ్‌రాజ్ బామల్వా అభిప్రాయపడ్డారు. భారతావనిలో శుభకార్యాలు జరగకపోవడం ఇందుకు ప్రధాన కారణమని, పండగ సీజనుకు ఇంకా సమయం ఉండడం, రుతుపవనాల రాకతో రైతులు పొలం పనుల్లో కాలం గడుపుతూ, పెట్టుబడి పెడుతుండటం బులియన్ డిమాండ్‌‌ను తగ్గించిందన్నారు. అయితే, ఆగస్టు తర్వాత ఈ పరిస్థితిలో మార్పు రావొచ్ని ఆయన చెప్పుకొచ్చారు.