గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By Raju
Last Modified: హైదరాబాద్ , శుక్రవారం, 10 మార్చి 2017 (05:00 IST)

హెచ్‌-1బీ వీసాలపై అమెరికా అక్కసు... మా ఉద్యోగాలు మింగే్స్తున్నారంటూ ఆక్రోశం

అమెరికన్ల ఉద్యోగాలను భారత ఐటీ కంపెనీలు కొల్లగొడుతున్నాయన్న ఆరోపణల నేపథ్యంలో హెచ్‌1బీ వీసాల చట్ట సవరణకోసం ఇప్పటికే ఆరుకుపైగా బిల్లులు అమెరికన్ కాంగ్రెస్‌లో ప్రవేశపెట్టారు. ఈ బిల్లులన్నింటి లక్ష్యం.. యూఎస్‌లోని భారత కంపెనీల్లో అమెరికన్లకు ఉద్యోగాలివ్వ

అమెరికన్ల ఉద్యోగాలను భారత ఐటీ కంపెనీలు కొల్లగొడుతున్నాయన్న ఆరోపణల నేపథ్యంలో హెచ్‌1బీ వీసాల చట్ట సవరణకోసం ఇప్పటికే ఆరుకుపైగా బిల్లులు అమెరికన్  కాంగ్రెస్‌లో ప్రవేశపెట్టారు. ఈ బిల్లులన్నింటి లక్ష్యం.. యూఎస్‌లోని భారత కంపెనీల్లో అమెరికన్లకు ఉద్యోగాలివ్వాలనటమే. కాగా, అమెరికన్ల ఉద్యోగాలు కొల్లగొడుతున్నారన్న వాదనను పరిశోధక విద్యార్థులు, ఆర్థికవేత్తలు, సిలికాన్  వ్యాలీ ఎగ్జిక్యూటివ్‌లు ఖండిస్తున్నారు.

భారత ఇంజనీర్లు, కంపెనీలపై పెను ప్రభావం చూపే హెచ్‌1బీ వీసాల సం స్కరణలపై ట్రంప్‌ సర్కారు సీరియస్‌గా ఆలోచిస్తోంది. అధికారంలోకి వచ్చాక  చేసిన ‘అమెరికా ఫస్ట్‌’ నినాదంతో దూకుడు మీదున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ వీలైనంత త్వరగా హెచ్‌1బీ వీసాల చట్టానికి మార్పులు చేసేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు అతని సన్నిహితులు చెబుతున్నారు.
 
వలసలకు చెక్‌ హెచ్‌1బీ వర్క్‌ వీసాలు కలిగిన వారిలో అధికంగా భారత ఐటీ ఉద్యోగులు, కంపెనీలే ఉన్నాయి. ట్రంప్‌ బాధ్యతలు చేపట్టిన వారం రోజుల్లోపే రిపబ్లికన్  సెనెటర్‌ చక్‌ గ్రాస్లీ మరో సెనేటర్‌తో కలిసి ‘హెచ్‌1బీ, ఎల్‌1 సంస్కరణ చట్టం’ను ప్రవేశపెట్టారు. సెనేట్‌ జ్యుడీషియరీ కమిటీ చైర్మన్  కూడా అయిన గ్రాస్లీ.. నిపుణులు, అమెరికా కార్మికులకు ప్రయోజనం చేకూరేలా వీసాల జారీలో మార్పులు చేసే ఉద్దేశంతో దీన్ని తెరపైకి తెచ్చారు.
అమెరికా ఉద్యోగుల స్థానంలో హెచ్‌1బీ, ఎల్‌1 వీసాదారులను తీసుకోవడాన్ని నిషేధించటం, ఈ వీసాలపై అమెరికా వచ్చిన నిపుణుల కనీస వేతనాలను రెట్టింపు చేయాలన్న నిబంధన సిలికాన్  వ్యాలీలోని అధిక శాతం భారతీయ కంపెనీలపై ప్రభావం చూపనుంది. గత నెలలో సెనేటర్‌ షెరాడ్‌ బ్రౌన్  తదితరులు అవుట్‌సోర్సింగ్‌ను నియంత్రించే బిల్లును ప్రవేశపెట్టారు. ఫిబ్రవరిలో రిపబ్లికన్  సెనేటర్లు టామ్‌ కాటన్ , డేవిడ్‌ పరడ్య... సుస్థిరమైన ఉద్యోగాల కోసం అమెరికన్  వలసల సంస్కరణ (రైజ్‌) చట్టం ప్రవేశపెట్టారు.
 
రిపబ్లికన్‌ పార్టీకి చెందిన టామ్‌ కాటన్‌, డేవిడ్‌ పర్డ్యూలు మొత్తంగా పదేళ్లపాటు ఏటా అమెరికాలోకి వలసలకు కత్తెర వేయాలంటూ బిల్లు తీసుకొచ్చారు. ఇటీవల భారత సంతతికి చెందిన కాంగ్రెస్‌ సభ్యుడు ఖన్నా మరో ముగ్గురితో కలిసి హెచ్‌-1బీ, ఎల్‌-1 వర్క్‌ వీసాల్లో సమగ్ర సంస్కరణలు తీసుకురావాలని ప్రత్యేక బిల్లు తీసుకొచ్చారు. వలసల విధానాలను సమూలంగా మార్చాలని ట్రంప్‌ భావిస్తున్న నేపథ్యంలో ఈ బిల్లులకు ప్రాధాన్యం సంతరించుకుంది. ఇవి వలసదారుల్లో, ముఖ్యంగా భారతీయుల్లో గుబులు రేపుతున్నాయి. మరోవైపు... హెచ్‌-1బీ, ఉద్యోగాలతో గ్రీన్‌కార్డు పొందడానికి సంబంధించి రిపబ్లికన్‌ సెనెటర్‌ టామ్‌ కాటన్‌ సంచలన ప్రతిపాదనలు చేశారు. హెచ్‌1-బీ వీసాలదారుల్లో పీహెచ్‌డీలు, కంప్యూటర్‌ సైంటిస్టులనే తాము కోరుకుంటున్నామని... ‘మిడిల్‌ లెవెల్‌’ ఉద్యోగులు అక్కర్లేదన్నారు. కాటన్‌ ఇటీవలే ట్రంప్‌ను కలిసి తన అభిప్రాయాలు పంచుకున్నారు.
 
అయితే ప్రీమియం (ఫాస్ట్‌ట్రాక్‌) వీసాల జారీని తాత్కాలికంగా నిలిపివేయడంవల్ల భారత్‌కు జరిగే నష్టం తాత్కాలికమేనని, ఆ తర్వాత మేలే జరుగుతుందని ప్రపంచ బ్యాంకు మాజీ ముఖ్య సలహాదారు కౌశిక్‌ బసు అభిప్రాయపడ్డారు. దీర్ఘకాలంలో ఇది అమెరికా ఆర్థిక వ్యవస్థను భారీగా దెబ్బతీస్తుందని చెప్పారు. మరోవైపు... విదేశీ ఉద్యోగులు, కార్మికులు లేకుంటే అమెరికాలో పనిచేసే వారి సంఖ్య పడిపోతుందని ‘ప్యూ రిసెర్స్‌ సెంటర్‌’ నివేదిక తెలిపింది.
 
అక్రమ వలసదారుల్ని అడ్డుకోవడమే అమెరికా లక్ష్యం తప్ప, హెచ్‌1బీ వీసాల్ని అడ్డుకోవడం కాదని ఆ దేశ సీనియర్‌ అధికారులు భారత్‌కు స్పష్టం చేశారని విదేశాంగ శాఖ తెలిపింది. హెచ్‌1బీ వీసాలపై భారత నిపుణుల్లో నెలకొన్న ఆందోళనల్ని తగ్గించే క్రమంలో విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి గోపాల్‌ బాగ్లే గురువారం విలేకరులతో మాట్లాడారు. హెచ్‌1బీ వీసాలపై డొనాల్డ్‌ ట్రంప్‌ యంత్రాంగంతో సంప్రదింపులు కొనసాగిస్తామని పేర్కొన్నారు. భారతీయుల నైపుణ్యంపై అమెరికాలో బలమైన గుర్తింపు, గౌరవం ఉన్నాయని.. అలాగే అమెరికా ఆర్థిక రంగానికి భారత్‌ సాంకేతిక నిపుణులు సాయం చేస్తున్నారన్న అభిప్రాయం అక్కడి ఉన్నతాధికారులతో చర్చల్లో వ్యక్తమైందన్నారు. హెచ్‌1బీ వీసాల జారీ వాణిజ్య, వ్యాపార, ఆర్థిక అంశమని అమెరికాకు స్పష్టం చేశామని గోపాల్‌ తెలిపారు.