బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By Raju
Last Modified: హైదరాబాద్ , శనివారం, 11 ఫిబ్రవరి 2017 (05:05 IST)

నేను పెంచి పోషించిన ఇన్ఫోసిస్‌లో ఇంత దిగజారుడా? గుండెబాదుకున్న ఎన్ఆర్ మూర్తి

‘ఉన్నత కార్పొరేట్‌ ప్రమాణాల విషయంలో ప్రపంచవ్యాప్తంగా మేం(ఇన్ఫోసిస్‌) ఎన్నో అవార్డులు అందుకున్నాం. అయితే, 2015, జూన్‌ 1 నుంచి(సిక్కాను అదే నెలలో సీఈఓగా ఎంపిక చేశారు) క్రమంగా ఈ ప్రమాణాలు దిగజారుతున్నాయి. దీనిపై వ్యవస్థాపకుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోం

‘ఉన్నత కార్పొరేట్‌ ప్రమాణాల విషయంలో ప్రపంచవ్యాప్తంగా మేం(ఇన్ఫోసిస్‌) ఎన్నో అవార్డులు అందుకున్నాం. అయితే, 2015, జూన్‌ 1 నుంచి(సిక్కాను అదే నెలలో సీఈఓగా ఎంపిక చేశారు) క్రమంగా ఈ ప్రమాణాలు దిగజారుతున్నాయి. దీనిపై వ్యవస్థాపకుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది’ అని సంస్థ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి పేర్కొన్నారు. ప్రధానంగా మాజీ సీఎఫ్‌ఓ రాజీవ్‌ బన్సల్‌ ప్యాకేజీని ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. అయితే, విశాల్‌ సిక్కా పనితీరుపై మాత్రం ఆయన పూర్తి విశ్వాసం వ్యక్తం చేయడం గమనార్హం. 
 
‘ఒక విషయాన్ని నేను స్పష్టం చేస్తున్నా. మేనేజ్‌మెంట్‌పై మాకు ఎలాంటి ఆందోళనా లేదు. సీఈఓపై మేం చాలా సంతృప్తితో ఉన్నాం. ఆయన పనితీరు బాగుంది. అయితే, మమ్మల్ని (వ్యవస్థాపకులు, సీనియర్లు, మాజీ ఉద్యోగులు) ఆందోళనకు గురిచేస్తున్న విషయం ఒక్కటే. కొన్ని నిర్ణయాలు, అంశాలకు సంబంధించి కార్పొరేట్‌ ప్రమాణాలు ఇంకాస్త మెరుగ్గా ఉంటే బాగుండేది’ అని మూర్తి పేర్కొన్నారు. కంపెనీలో కార్పొరేట్‌ నైతిక ప్రమాణాలు(గవర్నెన్స్‌) దిగజారాయని..  స్వయంగా కంపెనీ కీలక వ్యవస్థాపకుల్లో ఒకరైన ఎన్‌ఆర్‌ నారాయణ మూర్తి బాంబు పేల్చడంతో కంపెనీలో లుకలుకలు తీవ్రరూపం దాల్చాయి.
 
ఇన్ఫీ సీఎఫ్‌ఓ రాజీవ్‌ బన్సల్‌ రాజీనామా తర్వాత వీడ్కోలు ప్యాకేజీ కింద దాదాపు రూ. 23 కోట్ల భారీ మొత్తాన్ని బోర్డు ఆఫర్‌ చేయడం తెలిసిందే. మరో మాజీ సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ డేవిడ్‌ కెన్నడీకి కూడా రూ.5.85 కోట్ల రాజీనామా ప్యాకేజీ ఇచ్చారు. కంపెనీ సీఈఓ విశాల్‌ సిక్కా వార్షిక వేతన ప్యాకేజీని ఇప్పుడున్న 7.08 మిలియన్‌ డాలర్ల నుంచి ఏకంగా 11 మిలియన్‌ డాలర్లకు పెంచేందుకు బోర్డు ఓకే చెప్పింది. ఇష్టానుసారంగా ఇలా భారీ ప్యాకేజీలను ఆమోదించడాన్ని నారాయణమూర్తితో పాటు ఇతర కీలక వ్యవస్థాకులు నందన్‌ నీలేకని, క్రిస్‌ గోపాలకృష్ణన్‌ గట్టిగా వ్యతిరేకించినట్లు ఇప్పుడు తేటతెల్లమైంది. 
 
ఎంతో గొప్ప ప్రమాణాలతో తీర్చిదిద్దిన ఇన్ఫోసిస్‌లో ఇప్పుడు ఇలాంటి పరిణామాలు చోటుచేసుకోవడం చూస్తుంటే బాధ కలుగుతోందని నారాయణ మూర్తి ఒక బిజినెస్‌ దిన పత్రిక, టీవీ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు. బోర్డులో ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు.
 
ఇన్ఫోసిస్‌లో కార్పొరేట్‌ నైతిక ప్రమాణాలకు సంబంధించి ఎలాంటి ఉల్లంఘనలూ జరగలేదని బోర్డు సభ్యుల్లో ఒకరైన కిరణ్‌ మజుందార్‌ షా శుక్రవారం స్పష్టం చేశారు. అయితే, కొన్ని నిర్ణయాత్మక అంశాల్లో ప్రమోటర్లతో బోర్డు విభేదించి ఉండొచ్చని చెప్పడం విశేషం. ప్రమోటర్ల ఆందోళనలను తగ్గించే విషయంలో తగిన చర్యలపై బోర్డు దృష్టిసారిస్తుందని ఆమె పేర్కొన్నారు. సీఈఓ విశాల్‌ సిక్కా సారథ్యం పట్ల బోర్డు పూర్తి సంతృప్తితో ఉందని.. ఆయనను బాసటగా నిలుస్తుందని కూడా షా తేల్చిచెప్పారు. కలసికట్టుగా కంపెనీని కొత్త శిఖరాల దిశగా తీసుకెళ్లాల్సిన సమయంలో ఇలాంటి గందరగోళాన్ని సృష్టించడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. మొత్తంమీద బోర్డుకు, వ్యవస్థాకులకు మధ్య పొరపొచ్చాలు ఉన్నాయన్నది షా మాటలతో స్పష్టం అవుతోంది.