శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 25 ఫిబ్రవరి 2016 (16:22 IST)

రైల్వే ఓ జెర్సీ ఆవు.. పూర్తిగా పట్టాలు తప్పింది... లాలూ : ఇన్వెస్టర్లను మెప్పించని 'ప్రభు' ప్రసంగం

కేంద్ర రైల్వేమంత్రి సురేశ్ ప్రభు గురువారం లోక్‌సభలో ప్రవేశపెట్టిన 2016-17 వార్షిక బడ్జెట్‌పై ఆ శాఖ మాజీ మంత్రి, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ తనదైనశైలిలో స్పందించారు. సురేశ్ ప్రభు రైలు పూర్తిగా పట్టాలు తప్పిందన్నారు. ఈ రైల్వే బడ్జెట్ అంతా మోసమన్నారు. ఈ బడ్జెట్‌తో ప్రజలకు ఒరిగిందేమీ లేదని తేల్చి చెప్పారు. ప్రయాణికుల రక్షణకు ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వలేదన్నారు. యూపీఏ ప్రభుత్వంలో రైల్వే మంత్రిగా వ్యవహరించి పలు సార్లు రైల్వే బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆయన తన హాయంలో 60 వేల కోట్ల మిగులు నిధులున్నట్టు ప్రకటించిన విషయం తెల్సిందే.
 
మరోవైపు.. రైల్వే మంత్రి బడ్జెట్ ప్రసంగం కూడా స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడిదారులను మెప్పించలేక పోయింది. 'మేకిన్ ఇండియా' పేరు ఎన్నిసార్లు ఉచ్చరించినా, రైల్వేల్లో ప్రైవేటు సంస్థల భాగస్వామ్యానికి పచ్చజెండా ఊపుతున్నట్టు వెల్లడించినా, ఐటీ సంస్థలకు పని కల్పించేలా 'స్మార్ట్' పదాన్ని పలుమార్లు వాడినప్పటికీ స్టాక్ మార్కెట్ వర్గాలను మెప్పించలేకపోయింది. రైల్వేలతో సంబంధమున్న కంపెనీలతో పాటు, మౌలిక రంగంలోని కంపెనీలు, ఐటీ, బ్యాంకింగ్ రంగంలో కొనుగోలు మద్దతు కనిపించకపోవడంతో సూచికలు నష్టపోయాయి. సురేష్ ప్రభు ప్రసంగం ప్రారంభమైన కాసేపటికే భారీ నష్టాల దిశగా సాగిన సూచికలు జారుకోవడం గమనార్హం.