గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By PNR

సన్ టీవీ నెట్‌వర్క్‌కు నో సెక్యూరిటీ క్లియరెన్స్ : హోంశాఖ

డీఎంకే అధ్యక్షుడు కరుణానిధి మనుమలు అయిన మారన్ సోదరులకు చెందిన సన్ టీవీ నెట్‌వర్క్‌కు కేంద్ర ప్రభుత్వం సెక్యూరిటీ క్లియరెన్స్‌ ఇవ్వలేదని కేంద్ర హోంశాఖ స్పష్టంచేసింది. సన్‌ టీవీ యాజమాన్యం పలు నిబంధనలను ఉల్లంఘించినట్లు ఆరోపణలు రావటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు హోం మంత్రిత్వశాఖ ఉన్నతాధికారులు వెల్లడించారు. 
 
సమాచార, బ్రాడ్‌కాస్టింగ్‌ మంత్రిత్వశాఖ అనేక అభ్యంతరాలు లేవనెత్తింది. వీటికి ఏ ఒక్కదానికి కూడా సన్ టీవీ యాజమాన్యం నుంచి సంతృప్తికరమైన సమాధానంలేదు. దీంతో సన్‌ టెలివిజన్‌ నెట్‌వర్క్‌కు సెక్యూరిటీ క్లియరెన్స్‌ ఇచ్చేందుకు నిరాకరించినట్టు తాజాగా స్పష్టం చేసింది.
 
ఈ కారణంగా సన్‌ టీవీ నెట్‌వర్క్‌లోని 33 టీవీ చానల్స్‌ సహా ఎఫ్‌ఎం రేడియో స్టేషన్ల పరిస్థితి ఆగమ్యగోచరంగా మారే అవకాశాలు కన్పిస్తున్నాయి. సన్‌ టీవీ నెట్‌వర్క్‌కు సెక్యూరిటీ క్లియరెన్స్‌ను మంజూరు చేసేందుకు చట్టంలో ఎలాంటి ప్రొవిజన్లు లేవని, ఈ విషయంలో ఎలాంటి అభిప్రాయం తీసుకోవాల్సిన అవసరం లేదని అధికారులు స్పష్టం చేశారు.