బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By Selvi
Last Updated : శనివారం, 22 ఏప్రియల్ 2017 (10:45 IST)

పెద్ద నోట్ల రద్దుతో నల్లధనం, అవినీతి తగ్గలేదు.. ప్రజలకే అష్టకష్టాలు: వైవీరెడ్డి

నల్లధనం, అవినీతిపై నోట్ల రద్దు ప్రభావం అంతగా లేదని ఆర్బీఐ మాజీ గవర్నర్ యాగ వేణుగోపాల్‌రెడ్డి(వైవీరెడ్డి) సంచలన వ్యాఖ్యలు చేశారు. పెద్ద నోట్ల రద్దుతో నల్లధనం, అవినీతి కట్టడి కాలేదని.. సామాన్య ప్రజలకు క

నల్లధనం, అవినీతిపై నోట్ల రద్దు ప్రభావం అంతగా లేదని ఆర్బీఐ మాజీ గవర్నర్ యాగ వేణుగోపాల్‌రెడ్డి(వైవీరెడ్డి) సంచలన వ్యాఖ్యలు చేశారు. పెద్ద నోట్ల రద్దుతో నల్లధనం, అవినీతి కట్టడి కాలేదని.. సామాన్య ప్రజలకు కష్టాలే మిగిలాయని వైవీరెడ్డి అన్నారు. పెద్దనోట్ల రద్దుతో కోట్లాది మంది ప్రజలు తమ తప్పేమీ లేకపోయినా రెండు నెలలపాటు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారన్నారు. బహుశా ఏ దేశంలోనూ ఇలా జరగలేదని, ఇబ్బందులు ఎదురైనా ప్రజలు మౌనంగా భరించారని అన్నారు.
 
శుక్రవారం ''యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్''లో ప్రసంగిస్తూ.. పెద్ద నోట్ల రద్దుతో స్వల్పకాలిక ఆర్థిక ప్రభావం, నల్లధనం, అవినీతిపై ప్రత్యక్ష, తక్షణ ప్రభావం కూడా నామమాత్రమేనని స్పష్టం చేశారు. నోట్ల రద్దు కారణంగా భవిష్యత్తులో వ్యవస్థాగతంగా కూడా కొత్త చిక్కులు ఎదురయ్యే ప్రమాదం ఉందని వైవీరెడ్డి హెచ్చరించారు. అయితే నోట్ల రద్దు కారణంగా డిజిటల్ లావాదేవీలు విపరీతంగా పెరిగినట్టు చెప్పారు.
 
ఇదిలా ఉంటే.. పెద్ద నోట్ల ర‌ద్దు వల్ల దేశ ప‌రిస్థితి అధ్వాన్నంగా మారింద‌ని మాజీ ప్రధాని మ‌న్మోహ‌న్ సింగ్ గతంలో విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. నోట్ల రద్దు ద్వారా ఈసారి జీడీపీ 6.3 శాతానికి ప‌డిపోయే ప్రమాదముందని హెచ్చరించిన సంగతి తెలిసిందే. గ‌త రెండేళ్లలో దేశం ఆర్థికంగా ఎదిగింద‌ని ప్రధాని మోడీ చెబుతున్న మాటల్లో నిజం లేదన్న మన్మోహన్... భారత్ పతనానికి కౌంట్ డౌన్ ప్రారంభమైందని తెలిపారు.