గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By PNR
Last Updated : సోమవారం, 25 మే 2015 (20:19 IST)

దక్షిణాది మార్కెట్‌లో పరాగ్ మిల్క్ ఫుడ్స్ గో బట్టర్ మిల్క్

మహారాష్ట్ర, పూణే కేంద్రంగా పని చేస్తున్న పరాగ్ మిల్క్ ప్రోడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ తన డైరీ ఉత్పత్తులను దక్షిణ భారత మార్కెట్‌లోకి కూడా ప్రవేశపెట్టింది. ఇందులోభాగంగా దక్షిణాది రుచిని కలిగివుండే గో పేరుతో ఆవు పాల మజ్జిగ ప్యాకెట్లను విడుదల చేసింది. ఈ మజ్జిగ కేవలం దక్షిణాది వాసుల రుచి, సంస్కృతి సంప్రదాయాన్ని దృష్టిలో ఉంచుకుని తయారు చేసినట్టు ఆ కంపెనీ విడుదల చేసిన ఓ పత్రికా ప్రకటనలో పేర్కొంది. 
 
ఈ మజ్జిగ తయారీ కోసం గుంటూరు పచ్చిమిరపకాయలు, అల్లం, కరివేపాకు, దనియాలు, నల్ల మిరియాలు, జీరాలను వినియోగించారు. పైగా, ఆరోగ్యవంతంగా, పోషకాలు కలిగివుండేలా అన్ని వయస్సుల రీఫ్రెష్ డ్రింక్‌లా తాగేలా తయారు చేశారు. ఈ మజ్జిగ తయారీలో ఎలాంటి కృత్రిమ రంగులు లేదా రసాయనాలను వినియోగించలేదు. పైగా ఈ మజ్జిగను ఆరు లేయర్లతో యుహెచ్‌టి ప్యాకింగ్‌తో తయారు చేసిన ప్యాకెట్ల రూపంలో మార్కెట్‌లోకి విడుదల చేశారు. ప్రయాణానికి అనుకూలంగా ఉండేలా కూడా ప్యాకెట్లను కూడా అందుబాటులోకి తెచ్చారు.
 
 
ఈ ఉత్పత్తులపై ఆ కంపెనీ ఛైర్మన్ దేవేంద్ర షా మాట్లాడుతూ దక్షిణాదిలో తమ ఉత్పత్తుల విక్రయం ప్రారంభించడం వల్ల రోజువారీ డైలీ మార్కెట్‌లో తమ కంపెనీ వ్యాపారం పెరుగుతుందన్నారు. దేశ వ్యాప్తంగా ప్రతి రోజూ డైరీ మార్కెటింగ్ వ్యాపారం 3 మిలియన్ లీటర్లు చొప్పున జరుగుతోందన్నారు. ఇది 5500 కోట్ల రూపాయలుగా ఉందన్నారు. ప్రతి యేడాది 25 శాతం మేరకు వృద్ధిని సాధిస్తోందన్నారు. అందువల్లే తాము మరిన్ని ఉత్పత్తులను దక్షిణాది వాసులకు అనుగుణంగా తయారు చేసి ప్రవేశపెట్టినట్టు చెప్పారు. 
 
పశ్చిమ రాష్ట్రాల్లో ప్రారంభమైన తమ డైరీ మార్కెట్.. ప్రస్తుతం దేశంలో ప్రధాన డైరీ ఫుడ్ కంపెనీగా అవతరించిందని చెప్పారు. ప్రస్తుతం ఆయా ప్రాంతాల వాసులకు అనుగుణంగా డైరీ ఉత్పత్తులను తయారు చేస్తున్నట్టు చెప్పారు. ఇందులోభాగంగా గో పేరుతో మజ్జిగను తయారు చేసి దక్షిణాది మార్కెట్‌లోకి అడుగుపెట్టినట్టు చెప్పారు. గో బట్టర్ మిల్క్ సదరన్ స్పైస్ మజ్జిగ ప్యాకెట్లు తమిళనాడు, కర్ణాటక, కేరళ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో అందుబాటులో ఉంటాయన్నారు. వీటిని గల్ఫ్, సింగపూర్, మలేషియా తదితర దేశాలకు కూడా విస్తరించే అవకాశం ఉందన్నారు. 
 
ప్రస్తుతం దేశంలో అత్యధిక డైరీ ఉత్పత్తులు విక్రయం దక్షిణాదిలోనే జరుగుతున్నాయని గుర్తు చేశారు. అందుకే ఇక్కడ తమ మార్కెట్‌ను మరింతగా విస్తరించాలని భావిస్తున్నట్టు చెప్పారు. 200 ఎంఎల్ పరిమాణం కలిగిన గో బట్టర్ మిల్క్ టెట్రా ప్యాక్ ధర రూ.15, ఫినో ప్యాక్ ధర రూ.10గా నిర్ణయించినట్టు తెలిపారు. ఈ ప్యాకెట్లు 180 రోజుల వరకు నిల్వ ఉంటాయన్నారు. ఇవి అన్ని రీటైల్ స్టోర్లలో అందుబాటులో ఉంటాయన్నారు. ప్రస్తుతం తమ కంపెనీకి పూణె, చిత్తూరు జిల్లా పలమనేరులో రెండు ప్లాంట్లు ఉన్నాయనీ, వీటి నుంచే తమ డైరీ ఉత్పత్తులన్నీ తయారు చేస్తున్నట్టు చెప్పారు. ఇవి మాత్రమే కాకుండా, వెన్న, నెయ్యి, పన్నీర్, చీజ్ వంటి డైరీ ఉత్పత్తులు కూడా తయారు చేస్తున్నట్టు ఆయన వివరించారు.